ఆమనగల్లు, ఆగస్టు 13 : పల్లెప్రగతితో చరికొండ గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమం ఆ ఊరిలో స్పష్టమైన మార్పుమొదలైంది. గ్రామంలో పరిశుభ్రంగా సీసీ రోడ్లు, రాత్రివేళ వీధిదీపాల జిగేలు, ఆహ్లాదంగా గౌరవమ్మ చెరువు, పల్లెప్రకృతివనం, గ్రామం నుంచి మండల కేంద్రాలకు బీటీరోడ్డు రవాణా సౌకర్యం, వాగులపై వంతెన, గౌరవమ్మ చెరువు కింద పచ్చని పంటపొలాలు సాగు, వైకుంఠధామం, చెత్తడంపింగ్ కేంద్రం, కమ్యూనిటీహాలు నిర్మించారు. పంచాయతీలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ పాలకవర్గం పెద్దపీట వేస్తుంది. చరికొండ గ్రామం నాలుగు మండలాల ముఖ్య కూడలిగా ఉన్నది. గ్రామం నలువైపులా హరితహారంలో నాటిన మొక్కలు దర్శనం ఇస్తున్నాయి. పారిశుధ్య పనులు, మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ఇంటింటికీ చెత్తసేకరణ, నెలవారీ సమీక్షలు ఇలా గ్రామాన్ని ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది.
గతంలో చరికొండ పంచాయతీ అస్తవ్యస్తంగా ఉండేది. కనీస వసతుల కల్పన కల్పించేందుకు నిధులు వెచ్చించలేని పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మండలానికి వచ్చే బడ్జెట్ పంచాయతీలకు వస్తున్నాయి. గ్రామానికి రూ.7కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. చరికొండ నుంచి పల్లెచెల్కతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్లు, గ్రామానికి వెళ్లే దారిలో వాగులపై నిర్మించిన బ్రిడ్జిల నిర్మాణానికి రూ.1.50కోట్లు, మిషన్‌కాకతీయ చెరువు మరమ్మతులకు రూ.90లక్షలు, సీసీరోడ్లుకు రూ.25లక్షలు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణానికి రూ.30లక్షలు, శ్మశాన వాటికకు రూ.13.50లక్షలు, ట్రాక్టర్ కోసం రూ.8.50లక్షలు వీధిదీపాలకు రూ.3లక్షలు, రూ.2.40లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.3.50లక్షలతో పల్లెప్రకృతివనం పూర్తి కాగా, మిగతా రూ.70 లక్షల తో వివిధ రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు.
పల్లెల అభివృద్ధి కోసం పల్లెప్రగతి ఎంతో ఉపయోగ పడింది. ప్రజలు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకొనే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని వినియోగించుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతా. మండలంలోనే చరికొండను ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతా.
ఒకప్పుడు మండలాలకు వచ్చే నిధులు ప్రస్తుతం పల్లెలకు వస్తున్నాయంటే అది సీఎం కేసీఆర్ సార్ ఘనతే. పల్లెల్లో పచ్చని వాతావరణం, హరితహారంలో నాటి మొక్కలు గ్రామానికి పచ్చనితోరణాలుగా నిలుస్తున్నాయి. పట్టణాలను విడిచి బతుకుదెరువు కోసం పల్లెలకు తిరిగివస్తున్నారంటే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులే అందుకు కారణం.