అన్నదాతల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పండిన పంటను తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా.. ఆహార ఉత్పత్తులను శుద్ధి చేసి లాభాలను ఆర్జించాలన్న సదుద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జిల్లాకు ఒక ఆహార ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేయగా, యాచారం మండలం కొత్తపల్లిలో 334 ఎకరాల్లో నిర్మించే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌కు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్, మంచాల మండలం తాళ్లపల్లిగూడ, కొత్తూరు మండలం సిద్ధాపూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో అధికంగా సాగయ్యే కందులు, కూరగాయలు, చిరుధాన్యాలు, చింతపండు, మొక్కజొన్న పంటలకు సంబంధించిన ఆహార పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు ప్రభుత్వం సబ్సిడీ అందించనున్నది. జిల్లాలో ఇప్పటి వరకు టీఎస్ఐఐసీ నుంచి ఐదు వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత
అధికారులు పేర్కొన్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ): రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకుగాను ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా నుంచి నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదించగా, ఈ ఏడాది ఒక్కొ జిల్లాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో యాచారం మండలం కొత్తపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లో పూర్తిగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను 200 నుంచి 400 ఎకరాల్లో ఏర్పాటు చేయను న్నారు. ఇప్పటికే జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్, షాద్ నగర్లలో ఇండస్ట్రీయల్ పార్కులుండగా, రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం గా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో ఏర్పాటు చేయనున్న ఆహార ఉత్ప త్తులకు సంబంధించిన పరిశ్రమల్లో ఔత్సాహికులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందించనుంది, ఎస్సీలకు 35 శాతం, బీసీ, ఓసీలకు 15 శాతం, ఎస్సీ మహిళలకు 45 శాతం, బీసీ మహిళలకు 25 శాతం సబ్సిడీని ప్రభు త్వం అందించనుంది. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రూ. 75 లక్షల వరకు నిధులను అందజేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
జిల్లాలో యాచారం మండలం కొత్తపల్లిలోని 334 ఎకరా ల్లో, ఇబ్రహీంపట్నం మండలంలోని ఖానాపూర్ పరిధిలో 404 ఎకరాలు, మంచాల మండలం తాళ్లపల్లిగూడ పరిధిలోని 473 ఎకరాలు, కొత్తూరు మండ లంలోని సిద్ధాపూర్ గ్రామ పరిధిలో 330 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే తొలి విడతలో ఈ ఏడాది యాచారం మండలం కొత్తపల్లిలోని 334 ఎకరాల్లో ఆహార ఉత్పత్తి జోన్‌ను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో ఏయే పంటలు అధికంగా సాగవుతాయో సంబంధిత పంటలకు సంబంధించిన ఆహార పరిశ్రమలను మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అధిక మొత్తంలో సాగు చేసే కందులతోపాటు కూరగాయలు, చిరుధాన్యాలు, చింతపండు, మొక్కజొన్న పంటలకు సంబంధించిన ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. కందులను సాగు చేసే రైతులు తెలియక తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తుండగా, రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న దళారులు కందులను పప్పుగా మార్చేసి అధిక ధరకు విక్రయిస్తు లాభాన్ని అర్జి స్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతులు నష్ట పోతుండగా దళారులు మాత్రం లాభాలను పొందుతున్నారు. ఇలాంటి పరి స్థితి పోయి రైతులు లాభాలను పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో టమాట కూడా ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. అయితే టమా టలను పండించే రైతులు ఒక్కొ సమయంలో ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రోడ్డుపై పారవేయడం, పశువులకు మేతగా వేయడంలాంటివి చేస్తుంటారు, ఇలా ప్రతీ ఏడాది టమాటను సాగు చేసే రైతులు నష్టపోతున్నారు, టమాట రైతులు నష్టపోకుండా ఫుడ్ ప్రా సె సింగ్ జోన్లలో సంబంధిత పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే టమాట సాస్, టమాట జ్యూస్, టమాట సూప్‌లాంటివి తయారు చేసి రైతులు లా భాన్ని అర్జించవచ్చు. మొక్కజొన్న పంటకు సంబంధించి కూడా ఫుడ్ ప్రా సెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లయితే పాప్‌కార్న్, స్వీట్ కార్న్లాంటివి తయారు చేసి మార్కెట్‌కు తరలించవచ్చు. ఏయే జిల్లాలో ఏ ఆహార ఉత్ప త్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వమే నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతోపాటు రైస్మిల్స్ను కూడా సంబంధిత జోన్లో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకుగాను ఇప్పటివరకు ఐదు వేల వరకు టీఎస్ఐఐసీ ద్వారా దర ఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
యాచారం మండలం కొత్తపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు గాను ప్రక్రియను వేగవంతం చే శాం. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ చేపడుతాం. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నా రు. ఇప్పటికే ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి.