50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత 15వేలకుపైగా కంపెనీలు ఏర్పాటు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
జల్పల్లి మున్సిపాలిటీలో జాబ్‌మేళా
షాబాద్, ఆగస్టు 12 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలో పాల్గొని.. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫ్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేలకు పైగా వచ్చిన కంపెనీల్లో 15లక్షలకు పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో పెద్దఎత్తున ప్రపంచస్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో అమెజాన్, ఫార్మాలాంటి పెద్ద సంస్థలు రావడం శుభ పరిణామమన్నారు. ఇందులో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత ఉపాధికి సంబంధించి జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లడించారు. జల్పల్లిలో ఎక్కువగా మైనార్టీలు ఉన్నందున వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, మరొకసారి షాహిన్‌నగర్, ఎర్రకుంటలో నెల రోజుల్లో జాబ్‌మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా సుమారు 1800 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అమెజాన్, మ్యాజిక్ బస్, మైకో మాక్స్, విప్రో, అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్, వరుణ్ మోటార్స్, సెంట్రో, యురేకలాంటి ప్రముఖ సంస్థల్లో యువత ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.