ప్రభుత్వ దవాఖానలో పెరుగుతున్న రోగుల సంఖ్య
రోజూ 60 నుంచి 150 మందికి చికిత్స
గతం కంటే పెరిగిన ప్రసవాలు
నిరంతరం అందుబాటులో వైద్యసేవలు
కులకచర్ల, ఆగస్టు 12: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందడంతో రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. దవాఖానకు వచ్చే వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్సలు అందించేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు స్థానిక డాక్టర్లు. దీంతో వైద్యం చేయించుకునేందుకు ప్రైవేటు కంటే ప్రభుత్వ దవాఖానకే అధికంగా వస్తున్నారు స్థానికులు. గతంలో రోజుకు 20 నుంచి 40 మంది వచ్చేవారని సిబ్బంది తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దవాఖానలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రజలకు అందుబాటులో వైద్యం తీసుకురావడంతో రోగుల సంఖ్య పెరిగిపోయింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ప్రతి రోజు 60 నుంచి 150 మంది రోగులు చికిత్సల కోసం వస్తున్నారు. ప్రస్తుతం కాన్పుల సంఖ్య కూడా పెరిగింది.
ప్రభుత్వ చొరవతో పెరిగిన కాన్పులు
గతంలో ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేసుకోవాలంటే భయపడేవారు. మహాకష్టం మీద నెలకు 3, 4 కాన్పులు అయ్యేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వైద్యవిధానంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. దీంతో ప్రస్తుతం ఈ పీహెచ్సీలో నెలకు 30 నుంచి 40 కాన్పులు చేస్తున్నారు. 24 గంటలు ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకుంటే రూ.12 వేలు ఇస్తుండడం కూడా ఒక కారణం. దీంతో గర్భిణులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడంలేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు 9నెలల పాటు కావాల్సిన మందులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. ఈ పీహెచ్సీలో ఇప్పటి వరకు 800లకు పైగా ప్రసవాలు చేసి కేసీఆర్ కిట్లు అందజేసిట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అన్ని రకాల మందులు ఉంటున్నాయి. దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో రోగులు ఇక్కడే చికిత్సలు చేయించుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తే మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కేసీఆర్ కిట్.. సూపర్ హిట్
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తరువాత గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్యం చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ కిట్‌ను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల శాతం గణనీయంగా పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
అమ్మ ఒడి వాహనంతో సాయం
గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు 102 వాహనాన్ని ఏర్పాటు చేసి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రసవమయ్యాక ఇంటికి వెళ్లే దాక, పరీక్షలకు కూడా ఈ వాహనం ద్వారా సేవలను ప్రభుత్వం అందిస్తున్నది.
అందుబాటులో వైద్య సేవలు
కులకచర్ల పీహెచ్‌సీకి వచ్చే పేషెంట్లకు ఎప్పుడూ అం దుబాటులో ఉండి సేవలు చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్సలు అందిస్తున్నాం. దీంతో ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గ్రామాల్లో కూడా వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ వైద్యానికి భారీగా స్పందన లభిస్తున్నది.
ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం ఏర్పడింది
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గతంలో కంటే ప్రస్తుతం ఓపీల సంఖ్య పెరిగింది. ప్రైవేటుకు బదులుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం పీహెచ్‌సీలకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నది. ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం కలిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని విధాలుగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.