ఆమనగల్లు, ఆగస్టు 12 : మేడిగడ్డ పంచాయతీలో గురువారం తీజ్ సంబురాలు అంబురాన్నంటాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజన మహిళలు డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో వేడుకలకు వన్నె తెచ్చారు. వేడుకలకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తీజ్ వేడుకలు భావితరాలకు మన సాంస్కృతిక, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని వారు పేర్కొన్నారు. గిరిజన మహిళలు, చిన్నారులతో కలిసి నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. అనంతరం తండాలో తొమ్మిదిరోజుల పాటు కులదైవాలకు ప్రత్యేక పూజలు చేసిన గిరిజన మహిళలు తీజ్‌బుట్టలను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పంటలు బాగా పండాలని, అంటురోగాల బారిన పడకుండా చల్లంగా కాపాడాలి తల్లి అంటూ గిరిజనులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు తండావాసులతోపాటు ఆమనగల్లు పట్టణం నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.