విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం విద్య, గ్రంథాలయ శాఖల ఆధ్వర్యంలో ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీంతో విద్యార్థి దశలోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివే వీలుండడంతో వారు పరిణతి చెందే అవకాశం కలుగుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 244 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో గ్రంథాలయానికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ) : పాఠశాల దశ నుంచే విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా విజ్ఞానాన్ని పెంచేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ-గ్రంథాలయ శాఖల ఆధ్వర్యంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, ముందుగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నట్లయితే విద్యార్థి దశలో విజ్ఞాన, వ్యక్తిత్వ, వికాస పుస్తకాలను చదివే వీలుండడంతోపాటు విద్యార్థులు కూడా పరిణతి చెందనున్నారు. పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి సబితారెడ్డి, మరో వారం రోజుల్లో కౌకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
పైలట్ ప్రాజెక్టుగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొలుత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. తదనంతరం జిల్లాలోని మిగతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రంథాలయానికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 244 ఉన్నత పాఠశాలల్లోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పలు పాఠశాలల్లోని అదనపు గదుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ తదనంతరం ప్రత్యేకంగానే ఏర్పాటు చేయాలని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించడంతో అందుకు అనుగుణంగానే గ్రంథాలయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక రెడిమేడ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. కౌకుంట్లలో రెడిమేడ్ గ్రంథాలయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో మంత్రి ప్రారంభించనున్నారు.
మొదటి విడుతలో జిల్లాలో 27 ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకుగాను జిల్లా విద్యాశాఖ-గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదించిన హైస్కూళ్లలోనూ ఈ నెలలోనే గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సంబంధిత గ్రంథాలయాల్లో విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే వీలుగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఇతర చరిత్రల పుస్తకాలు, పురాణాలు, కథలు, కవితలు, ఆరోగ్య పరిసరాల విజ్ఞానం, పొడుపు కథల పుస్తకాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.
మరో వారం రోజుల్లో కౌకుంట్లలో గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తాం. దశలవారీగా జిల్లాలోని మిగతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాం. గ్రంథాలయాల ఏర్పాటుకుగాను జిల్లాకు రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో గ్రంథాలయానికి రూ.10 లక్షలను ఖర్చు చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేందుకుగాను సంబంధిత పుస్తకాలను కూడా అందజేస్తాం. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లయితే విద్యార్థుల భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపుతుంది.