షాబాద్, ఆగస్టు 11: జిల్లాలోని అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డిజిల్లా గృహ నిర్మాణశాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారులకు ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. స్థానికంగా అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పారు. పేదలు కూడా గొప్పగా బతుకాలనే సంకల్పంతోనే ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. వారికి సీఎం కేసీఆర్ సామాజిక హోదాను కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రాజీవ్ గృహకల్ప, ఇందిరా ఆవాస్ యోజన పథకాల్లో భాగంగా నిర్మించి ఇచ్చిన ఖాళీలను గుర్తించి వివరాలు అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియను డిసెంబర్ వరకు పూర్తి చేసి వచ్చే మార్చి నెలలో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి పీడీ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.