హరితహారం ఫలితంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్ ఆవరణలు పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. వివిధ రకాల మొక్కలు ఏఫుగా పెరిగి ఫిర్యాదు దారులకు, స్టేషన్ సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. పచ్చని మొక్కలతో పోలీస్ స్టేషన్లు నందనవనాల్లా మారాయి. పూలు, పండ్ల మొక్కలతో పాటు గ్రీన్ గ్రాస్ చూపరుల మనస్సును దోచేస్తున్నాయి. పచ్చని ప్రకృతితో పోలీస్ స్టేషన్లు అలరారుతున్నాయి.
మానసిక ఒత్తిడి తగ్గుతుంది..
పోలీస్ స్టేషన్లో పచ్చని వాతావరణం ఉండడం వల్ల కేసుల విషయంలో లోనైన ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటివరకు చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 1500 మొక్కలు నాటడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
ప్రశాంత వాతావరణం
కోట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది. సిబ్బంది మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో మొక్కలు నాటడం ఒక భాగంగా మారింది.
హరిత ఠాణా..
పోలీస్ స్టేషన్ ఆవరణలో పచ్చని మొక్కలు కనువిందు చేస్తున్నాయి. రకరకాల మొక్కలతో హరిత ఠాణాగా మారింది. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటుతున్నాం. పచ్చని మొక్కల వల్ల ప్రశాంతత లభిస్తున్నది.
పచ్చదనంతో మనశ్శాంతి..
పచ్చని వాతావరణంతో మనశ్శాంతి లభిస్తుంది. చెట్టునీడలో చల్లని గాలికి కాసేపు సేదతీరితే ఎంతటి బాధనైనా ఇట్టే మరిచిపోవచ్చు. కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా 500 మొక్కలు నాటాం.
మంచి ఆలోచనలొస్తాయి..
పచ్చని చెట్ల మధ్యన కూర్చుని కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి. ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటితేనే హరిత తెలంగాణ సాధ్యం.
మానసిక స్థితి మారుతుంది..
ఆహ్లాదకర వాతావరణంలో నేరగాళ్ల మానసిక పరిస్థితి మారుతుంది. కేశంపేట పోలీస్ స్టేషన్ పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. పచ్చదనంతో కూడిన పకృతిని చూస్తే ఎంతటి వారిలోనైనా మార్పు వస్తుంది.