గూడులేని పేదల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అర్హులైనవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకనుంచి సొంత జాగ ఉండి గూడులేని పేదలకు సైతం ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నది. ఈ మేరకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే విధి విధానాలు రూపొందించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1000-1200 ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో 7 వేలకుపైగా, వికారాబాద్ జిల్లాలో 5వేల మందికి పైగా లబ్ధి చేకూరనున్నది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇప్పటికే పూర్తయిన ఇండ్లల్లో వసతులు కల్పించి త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 9, (నమస్తే తెలంగాణ): గూడులేని పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. తాజాగా సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థికంగా సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగ ఉంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనున్నది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇల్లులేక, సొంత జాగ ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే తయారు చేసి, సంబంధిత పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. నియోజకవర్గానికి 1000 నుంచి 1200 మందికి ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో 7 వేలకుపైగా పేదలకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే ఇల్లులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం, తాజాగా జాగ ఉంటే ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకురావడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, సంబంధిత ఇండ్లకు రూ.26 కోట్లతో మౌలిక సదుపాయాలు విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.
సిద్ధంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్లు
జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి వ్యక్తిగత ఇండ్లతోపాటు జీ ప్లస్2, జీ-ప్లస్3గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్లలో 45 శాతం మేర ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. జిల్లాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. జిల్లాలో 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. మౌలిక వసతుల పనులు ఈనెలాఖరులోగా పూర్తి చేసి, వచ్చేనెలలో లబ్ధిదారులకు ఈ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు షాద్‌నగర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇండ్లు పూర్తి కావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా పూర్తైన ఇండ్లలో 1880 ఇండ్లు షాద్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించినవి. జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజకవర్గానికి 1060 ఇండ్లు, కల్వకుర్తికి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నంకు 1239 ఇండ్లు, షాద్‌నగర్ నియోజకవర్గానికి 3100 ఇండ్లు, రాజేంద్రనగర్‌కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.
నెరవేరనున్న సొంతింటి కల
పరిగి, అక్టోబర్ 9: నిరుపేదల సొంతింటి కల సాకారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఉచితంగా అందజేస్తున్నది. పేదలకు సొంతంగా స్థలం ఉంటే ఆర్థిక సాయం చేసి ఇంటిని నిర్మించేందుకు కృషి చేస్తున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలో సుమారు 5వేల మంది పేదలకు ప్రయోజనం చేకూరనున్నది. తమకు స్థలం ఉందని, అక్కడే ఇంటి నిర్మాణం చేపడతామని, ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే చాలని వేలాది మంది పేదలు కోరుకుంటున్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో జాగ ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి మందికి పైగా లబ్ధి చేకూరనున్నది.
వెయ్యి నుంచి 1200 మందికి లబ్ధి
జాగ ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి నుంచి 1200 మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నది. ఎంత స్థలంలో ఎంత మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు డబ్బులిచ్చేందుకు విధి విధానాలు సూచించనున్నారు.
బీదల పెన్నిధి సీఎం కేసీఆర్
దిక్కులేని వారి పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయాన్ని అందించను న్నట్లు ప్రకటించి.. పేదల పెన్నిధిగా నిలుస్తున్నాడు. స్థలం ఉన్నా ఇల్లు కట్టుకుందామంటే డబ్బుల్లేవు. ఉన్న ఇంటిలోనే సర్దుకుని బతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు ఇంటిని నిర్మించుకునేందుకు
సాయమందిస్తున్న సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలే.
ప్రభుత్వ నిర్ణయం గొప్పది
ఇండ్లులేని పేదలకు సొంతంగా నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలుపడం సంతోషకరం. ఇన్నేండ్లు ఇండ్లు లేకుం డా ఇబ్బందులు పడిన పేదలకు ఇది మంచి అవకాశం. జాగ ఉంటే చాలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నదని తెలిసి, చాలామంది సొంతింటి కల నెరవేరుతుండడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇలాం
టి సీఎం మన తెలంగాణకు ఉండడం మనం చేసుకున్న అదృష్టం.
దిక్కులేని వారికి దేవుడే దిక్కుగా..
తిండి, గూడు, బట్ట ఉంటే చాలు. నెలనెలా రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నడు, పండుగలకు బట్టలు ఇస్తున్నడు. ఇప్పుడు జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు పైసలు కూడా ఇస్తానని చెప్తున్నడు. కేసీఆర్ సారు లాంటోళ్లు ఉంటే నాలాంటోళ్లకు మంచి అయితది. దిక్కులేనోళ్లకరు దేవుడే దిక్కవుతడు అన్నట్లు బీదలందరికీ సీఎం కేసీఆర్ సారే దిక్కనిపిస్తున్నది.
ఆ సారు సల్లంగా ఉండాలే.
సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం
సొంత స్థలం ఉన్న వారికి ఇం టిని నిర్మించి ఇ వ్వనున్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం. మా గ్రామంలో చాలామంది ఖాళీ స్థలాలు కలిగి ఉన్నారు. వారందరికీ ఇండ్లు నిర్మించి, ఇస్తే మేలు జరుగుతుంది. త్వరగా పేదవారికి ఇండ్లు నిర్మించి ఇస్తే దేవుడిగా కొలుస్తారు.