షాద్‌నగర్ రూరల్, అక్టోబర్7: భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నది ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట అంబాభవానీ అమ్మవారు. అందుకే కాబోలు రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఏ శుభకార్యాన్ని తలపెట్టినా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రారంభిస్తుంటారు. ప్రతి మంగళ, శుక్రవారం, అమావాస్య రోజుల్లో భక్తుల సందడి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తుంటారు.
ఆలయ చరిత్ర..
ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. కాకతీయుల కాలంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఎలికట్ట గ్రామ శివారు నుంచి జడ్చర్ల సమీపంలోని గంగాపురం లో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి కొంద రు భక్తులు స్తంభాలను తీసుకెళ్తుండగా అన్నయ్య నా ఆలయ నిర్మాణానికి నాలుగు స్తంభాలను ఇవ్వమని ఒక ధ్వని(అమ్మవారు) కోరినట్లు, అయినప్పటికీ ఆ భక్తులు పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే ఎడ్లబండ్లు కదలకపోవడంతో ఆ భక్తులు నాలుగు స్తంభాలను అక్కడ విడిచి వెళ్లారని పూర్వీకులు చెబుతుంటారు. నేటికీ అమ్మవారి ఆలయంలో ఆ నాలుగు స్తంభాలు కనిపిస్తా యి. అదేవిధంగా నారాయణపేటకు చెందిన ఓ భక్తుడికి మాటలు రాకపోవడంతో ఆలయానికి వచ్చి 21రోజులపాటు దీక్ష చేయగా.. 21వ రోజున భక్తుడు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు పులి రూపంలో దర్శనవ్వగా మాటలు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. నిష్ఠతో అమ్మవారిని పూజిస్తే కరుణిస్తుందని భక్తులకు అపార నమ్మకం. అదేవిధంగా ఆలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవస్వామి ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తు లు ఆ స్వామికి కూడా పూజలు నిర్వహిస్తుంటారు.
షాద్‌నగర్ పట్టణానికి
ఆరు కిలోమీటర్ల దూరంలో..
షాద్‌నగర్ పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో, ఎలికట్ట గ్రామం నుంచి కిలోమీటరు దూరంలో అమ్మవారి ఆలయం ఉన్నది. ఆలయ ప్రాంగణంలో కాలభైరవుడు, వీరభద్రస్వామి ఆలయం ఉంది.
వైభవంగా నవరాత్రులు
ప్రతిఏటా అమ్మవారి నవరాత్రులను అంబభవాని ఆలయంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఉద యం అమ్మవారికి అభిషేకాలు, లలితాసహస్రనామ పారాయణం వంటి ప్రత్యేక పూజలతోపాటు హోమాన్ని నిర్వహిస్తారు. అంతేకాకుండా ఉద యం భజన కార్యక్రమం, పల్లకీసేవ కార్యక్రమాలుంటాయి. అమ్మవారి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉం చుకొని వసతులు కల్పించారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యాంసుందరాచారి సూచించారు.
ఎంతో మహిమ గల అమ్మవారు
అంబాభవానీ అమ్మవారు ఎంతో మహిమగలది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నది. ప్రతి మంగళ, శుక్రవారం, అమావాస్య రోజుల్లో భక్తుల సందడి అధికంగా ఉం టుంది. అమ్మవారికి ప్రతిరోజూ పూజాకార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
-భవానీశంకర్ ,ఆలయ ప్రధాన పూజారి
అమ్మవారికి ప్రత్యేక పూజలు
నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహి స్తాం. భక్తుల కష్టాలను తీర్చుతూ అమ్మలగన్న అమ్మగా అమ్మవారు పేరు పొం దారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి.
-కృష్ణయ్య, ఆలయ కమిటీ చైర్మన్, అంబాభవానీ ఆలయం. ఎలికట్ట
నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి
దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఇబ్బందుల్లేకుండా వసతులు కల్పించడం జరిగింది. భక్తులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలి.
-శ్యాంసుందరాచారి, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎలికట్ట