
షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్7: గల్లీకొక్క గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న నేటి రోజుల్లో 40 ఏండ్లుగా ఒకే మండపంలో ఒక గణపయ్యను ప్రతిష్ఠించి, వారి ఐక్యతను చాటుతున్నారు లింగారెడ్డిగూడ గ్రామస్తులు. కుల, మతాలకు అతీతంగా పండుగలు జరుపుకొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజిస్తున్నారు. అందరు కలిసి కుల, మత, రాజకీయాలకు అతీతంగా గణేశ్ చందాలు వసూలు చేస్తూ ప్రతియేట 11 రోజులు పూజల్లో కలిసికట్టుగా పాల్గొంటారు.
కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ నాయకుడు
ప్రతి సంవత్సరం గ్రామపెద్దల సమక్షంలో ఉత్సవ కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. గతేడాది గ్రామంలోని మైనార్టీకి చెందిన గఫూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికై ఉత్సవాలు ఘనంగా జరిపించాడు. ఈ ఉత్సవాల్లో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన మైనార్టీ యువకుడు మేరాజ్ రూ.1,06,500ల కు దక్కించుకున్నాడు.
మిగులు నగదు దేవాలయ అభివృద్ధికి..
గణేశ్ ఉత్సవాల ముగింపు పూర్తయిన వారం రోజల లోపు కమిటీ సభ్యులు గ్రామపెద్దలకు ఉత్సవాల లెక్కలు చూపెడుతారు. వసూలు చేసిన చందాలు, లడ్డూ వేలం పాటలో వచ్చిన నగదు పోగు చేసి వాటిలో ఖర్చులు పోను, మిగ తా డబ్బును దేవాలయాభివృద్ధికి వినియోగిస్తారు.
గణనాథుడి ఆశీస్సులతోనే ఉత్సవాలు
గణనాథుడి ఆశీస్సులతోనే మా గ్రామం లో ప్రతీయేట గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. 11 రోజుల పాటు విశేష పూజలతో గణనాథుడిని ఆరాధిస్తాం. ఒకే గణపయ్య ఉండడంతో గ్రామస్తులందరూ పూజల్లో పాల్గొంటారు. – శశాంక్, గ్రామస్తుడు
ప్రతి పనిలోనూ గ్రామస్తుల సహకారం
ఏ పని చేపట్టినా సమిష్టిగా చేస్తాం. పం డుగలు, పబ్బాలు ఏదైనా సరే ఐకమత్యంతో ముందుకెళ్తాం. గ్రామాభివృద్ధి లో గ్రామస్తులంతా ఒక్కటిగా నడుస్తా రు. గణపయ్య దీవెనలతో మా గ్రామం చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నా. – బీష్వ మాధవి, సర్పంచ్
ఐకమత్యమే మా బలం
ప్రతిఒక్కరం ఐకమత్యంగా ఉంటాం. గణేశ్ ఉత్సవాలను అన్నివర్గాల ప్రజలు కలిసి జరుపుకొంటాం. గ్రామంలో ఒకే గణపయ్య విగ్రహాన్ని పెట్టి పూజిస్తాం. అందరూ కలిసి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది.