హరితహారం ఫలితంగా పల్లెలు, పట్టణాలు పచ్చబడ్డాయి. ఏ రహదారి చూసినా.. ఏ వీధికెళ్లినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అయితే గ్రామాల్లో మరింత పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. హరితహారం కార్యక్రమానికి నిధుల కొరతతో అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘హరితనిధి’కి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారుల వరకు అందరి నుంచి నిధులు సేకరించనున్నది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నుంచి ప్రతి నెలా రూ.500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్ల నుంచి రూ.100, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.50 ఇలా .. ఆయా విభాగాల నుంచి నిధులు సేకరించనున్నది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకోగా అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. నిధుల సేకరణతో పచ్చదనం పెంపులో అందరికీ భాగస్వామ్యం లభించినట్లవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు దాతలు అదనంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రూ.5వేలం విరాళం ప్రకటించారు.
ఇది చారిత్రాత్మక ఘట్టం..
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు హరితనిధి ఎంతో తోడ్పడనున్నది. అడవులను పెంపొందించడంతో పాటు రోడ్లవెంబడి, పొలంగట్లు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పర్యావరణం పరిరక్షించబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-శ్రీనివాస్‌రావు, విద్యావేత్త, ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/పరిగి, అక్టోబర్ 4 :హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకుగాను సీఎం కేసీఆర్ హరితనిధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పల్లెలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను ఏర్పాటు చేసింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్న సదుద్దేశంతో హరితహారం కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. నిధుల కొరతతో అడ్డంకులు ఏర్పడవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ఫండ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. హరితహారం నిరంతరం కొనసాగేలా విద్యార్థులు మొదలుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులనూ భాగస్వాములను చేసి, నిధిని సేకరించి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హరిత ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయానికి ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి రూ.5 వేల విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు.
హరిత నిధి సేకరణ..
హరితనిధిలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్రతి నెలా రూ.500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల నుంచి రూ.100, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్ల నుంచి రూ.100, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.50, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల నుంచి రూ.10, అన్ని రకాల కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల నుంచి 0.1 శాతం, వ్యాపార, వాణిజ్య ప్రతి లైసెన్స్ రెన్యూవల్ నుంచి రూ.1000, భూక్రయ, విక్రయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతీ రిజిస్ట్రేషన్‌కు రూ.50 చొప్పున హరితనిధి కింద జమ చేయనున్నారు. విద్యార్థుల్లోనూ భాగస్వాములను చేస్తూ డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో రూ.25లు, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు రూ.15లు, స్కూల్ అడ్మిషన్లకు రూ.10లు, వృత్తివిద్యా కాలేజీ అడ్మిషన్లకు సంబంధించి రూ.100 హరితనిధి కింద ప్రత్యేకంగా జమ చేయనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10శాతం నిధులు హరితనిధికి జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హరితనిధికి తాము సైతం భాగస్వాములమవుతామని అన్ని వర్గాల నుంచి స్పందన వస్తున్నది.
హరితనిధి కాన్సెప్ట్ బాగుంది..
ఆమనగల్లు, అక్టోబర్ 4 : హరిత నిధి కాన్సెప్ట్‌ను సీఎం కేసీఆర్ తీసుకురావడం స్వాగతించాల్సిన విషయం. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణకు ఏ రాష్ట్రం చేయని విధంగా శ్రీకారం చుట్టారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న హరితనిధిని అందరూ స్వాగతిస్తున్నారని ఆమనగల్లు ఫారెస్ట్ రెంజ్ అధికారి కమాలొద్దీన్ అన్నారు. ఆయనతో ‘నమస్తే తెలంగాణ’
ఇంటర్వ్యూ..
నమస్తే : హారితనిధి ప్రచారంలో ఎలా భాగస్వామ్యమవుతారు..
అధికారి : అడవులు పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ఫారెస్ట్ అధికారులది పెద్దన్న పాత్ర. హరితహారం కార్యక్రమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లి అడవుల ప్రాధాన్యత తెలిపేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నాం. కళాశాల, పాఠశాల విద్యార్థులను అటవీశాఖ పరిధిలో టూర్ విజిట్ అనే ప్రత్యేక కార్యక్రమాల ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు పర్యావరణంపై మక్కువ పెరిగి మొక్కలు పెంచేందుకు బాధ్యతగా వ్యవహరిస్తారు.
నమస్తే : ఉద్యోగుల ఆలోచన..
అధికారి : ఫారెస్ట్ సిబ్బంది హరితనిధి కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ ఆలోచనకు అన్ని శాఖల ఉద్యోగులు హర్షం తెలుపుతున్నారు.
నమస్తే : రెంజ్ పరిధిలో ఏం చేయనున్నారు..
ఆమనగల్లు ఫారెస్ట్ రెంజ్ పరిధిలో హరితనిధిపై వినూత్నంగా ప్రచారం చేస్తాం. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. అటవీ సంపద పై అటవీశాఖ సిబ్బంది అవగాహన సదస్సులు చేపడుతాం.
వికారాబాద్ జిల్లాలో
వికారాబాద్ జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 5లక్షల మొక్కలు నాటుతున్నారు. మరో నెల రోజుల్లో 72 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, ఎకరాకు 3,100 మొక్కలు నాటనున్నారు. పట్టణాల్లోని ప్రైవేటు లే అవుట్లలో పార్కులను ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. గ్రామపంచాయతీల సంరక్షణలో ప్రతి రహదారికి ఇరువైపులా రెండు వరుసలలో మొక్కలు నాటుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో రెండున్నర కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
హరితనిధికి మేము సైతం…
వికారాబాద్ జిల్లా పరిధిలో 7.425 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఉన్నారు. 928 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వారిలో ఒక ఎమ్మెల్సీ, ఒక జెడ్పీ చైర్పర్సన్, నలుగురు ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీపీలు, 18 మంది జెడ్పీటీసీలు, 566 మంది సర్పంచ్‌లు, 203 మంది ఎంపీటీసీలు, 18 మంది మండల కో-ఆప్షన్ సభ్యులు, ఇద్దరు జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రతి సంవత్సరం 3 నుంచి 3,500 మంది విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ప్రతి సంవత్సరం 10వేల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందుతారు. జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, ప్రజా ప్రతినిధుల నుంచి ప్రతినెలా హరితనిధికి డబ్బులు సమకూరనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో
రంగారెడ్డి జిల్లాలో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, మండలానికి ఒక బృహత్ వనం తదితర కార్యక్రమాలతో జిల్లా అంతటా పచ్చదనం కళకళలాడుతున్నది. జిల్లాలో అటవీ విస్తీర్ణం కూడా 5 శాతం మేర పెరిగింది. జిల్లాలో ఏడేండ్లుగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్ల మొక్కలు, 2017-18 సంవత్సరంలో 71.04 లక్షలు, 2018-19 సంవత్సరంలో 86.12 లక్షల మొక్కలు, 2019-20 సంవత్సరంలో 1.02 కోట్ల మొక్కలు, 2021-22 సంవత్సరంలో 74 లక్షల మొక్కలను నాటారు. ఊరూరా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలానికి ఒక బృహత్ ప్రకృతి వనాలనూ ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత ప్రకృతివనాల్లో మూడేండ్లలో చిట్టడవులుగా మారడంతోపాటు పచ్చదనం పెంపొందనున్నది.
జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు..
రంగారెడ్డి జిల్లాలో ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక జెడ్పీ చైర్పర్సన్, 21 మంది జెడ్పీటీసీలు, 267 మంది ఎంపీటీసీలు, 16 మంది మున్సిపల్ చైర్పర్సన్లు, 558 మంది సర్పంచులు, 363 మంది కౌన్సలర్లు ఉన్నారు. వీరితోపాటు 12,557 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
పల్లెలన్నీ పచ్చగా మారాయి..
హరితహారంతో పల్లెలన్నీ పచ్చగా మారాయి. నిరంతరం కొనసాగేలా హరితనిధి కార్యక్రమాన్ని చేపట్టడం అద్భుత నిర్ణయం. మొక్కలు విరివిగా నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది.
హరితనిధి చారిత్రక ఘట్టం..
హరితనిధి సేకరణ చారిత్రక ఘట్టంగా నిలువనున్నది. ముందు తరాలకు హరితహారంతో ఎంతో మేలు జరుగనున్నది. ప్రతి ఒక్కరూ సహకరించి, నిధులను అందజేయడంతో పాటు మొక్కలు నాటాలి. వనాల పెంపుతో వర్షాలు సమృద్ధిగా కురువనున్నాయి.
ఆరోగ్య తెలంగాణకు బాటలు..
హరితహారం ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తున్నది. హరితనిధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులను భాగస్వాములను చేయడం సంతోషకరం. సీఎం కేసీఆర్ వెంట అందరం కలిసి నడిచేందుకు సిద్ధం. మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిద్దాం.
సీఎం పిలుపునకు మేము సైతం..
ఇలాంటి చక్కటి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలునకు మేము సహితం పాల్గొంటాం. ప్రభుత్వ ఉద్యోగిగా హరితనిధికి స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నా. హరితహారంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలువనున్నది.