రంగారెడ్డి, అక్టోబర్ 3, (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగయ్యేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదు గంటలపాటు చర్చ కొనసాగింది. ప్రధానంగా పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, వ్యవసాయం, విద్య, వైద్యాశాఖలపై చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పదే పదే ఒకే అంశాన్ని లేవనెత్తడంపై మంత్రితోపాటు ఇతర సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకుగాను గ్రామసభలు నిర్వహించాలన్న సభ్యుల కోరిక మేరకు, ఈనెల 17 నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లోని, మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కబ్జాలకు గురికాకుండా ఈ నెల 17 నుంచి ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆసరా పింఛన్ల నిమిత్తం నెలకు రూ.38 కోట్లను ఖర్చు చేస్తున్నామని, పెండింగ్ పింఛన్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరం క్యాంపులను నెలకు నాలుగు మండలాల్లో నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో వారంలో రెండు రోజులు సదరం క్యాంపు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రతి మండలంలో 30 శాతం స్కూళ్లలో మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లకూ ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని గచ్చిబౌలి, ఎల్బీనగర్లో రెండు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఈనెల 17 నుంచి గ్రామసభలు..