రాష్ట్ర సర్కార్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతులతోపాటు మత్స్యకార కుటుంబాల్లోనూ వెలుగులు నింపుతున్నది. చెరువులు, కుంటల పునరుద్ధరణతో భారీగా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో చేపల పెంపకం ఊపందుకున్నది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపల పంపకంపై దృష్టి సారించడంతో రంగారెడ్డి జిల్లాలో నీలి విప్లవం మొదలైంది. అంతేకాకుండా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుండగా.. ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీని జోరుగా సాగుతున్నది. ఈసారి మొత్తం 837 చెరువుల్లో 1.70 కోట్ల చేప పిల్లలు వదలడమే లక్ష్యంగా జిల్లా అధికారులు ముందుకు సాగుతున్నారు. 20 రోజుల్లో చేప పిల్లల పంపిణీని పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, జిల్లాలో 110 మత్స్యకారుల సొసైటీలుండగా.. 5 920 మంది సభ్యులు ఉన్నారు.
షాద్‌నగర్, అక్టోబర్ 3 : సర్కారు ముందుచూపుతో మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. మిషన్ కాకతీయ ఫలాలు రైతులకే కాకుండా మత్స్యకారులకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఏండ్లుగా చేపల ఉత్పత్తిపై దృష్టి సారించడంతో జిల్లాలో నీలి విప్లవం మొదలైంది. మూడు సంవత్సరాల నుంచి చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో చేపల సాగుకు అనువుగా మారాయి. చేపల ఉత్పత్తి ఘననీయంగా పెరుగడంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
జిల్లాలో 1.70 కోట్ల చేప పిల్లల పంపిణీ
రంగారెడ్డి జిల్లాలోని 837 చెరువుల్లో 1.70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కొన్ని రోజులుగా చేప పిల్లల పంపిణీ పక్రియకు శ్రీకారం చుట్టింది. 20 రోజుల్లోపు అన్ని చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్య శాఖ అధికారులు నిర్ణయించారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ, మ్రిగాల వంటి నాలుగు రకాల చేప పిల్లలను పెంచనున్నారు. నల్లగొండ జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరు నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజ్‌లో ఉండే చేప పిల్లలు పెంచేందుకు అనువుగా ఉంటాయి. ఒక్కో చేప పిల్లను రాష్ట్ర ప్రభుత్వం 58 పైసలకు కొనుగోలు చేసి మత్స్య కారుల సొసైటీలకు అందిస్తున్నది. జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపలను పెంచడం వల్ల గడిచిన ఏడాది సుమారు 4.5 వేల టన్నులకు పైగా చేపల ఉత్పత్తి అయ్యింది. ఇబ్రహీంపట్నం, వెల్జాల్, జల్పల్లి, పాలమాకుల, ఆమన్‌గల్, షాబాద్, తారమతిపేట, పెద్ద అంబర్‌పేట, అనాజీపూర్, రావిర్యాల వంటి పెద్ద చెరువుల్లో చేపల ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. ఫరూఖ్‌నగర్, కొత్తూరు, షాబాద్, కేశంపేట, యాచారం, చెవేళ్ల, మహేశ్వరం, ఆమన్‌గల్లు, మాడ్గుల, రాజేంద్రనగర్, శంకర్పల్లి వంటి మండలాల పరిధిలోని చెరువుల్లో చేపల సాగు పెరుగనున్నది.
జిల్లాలో 5,920 మత్స్య కార్మికుల కుటుంబాలు..
రంగారెడ్డి జిల్లాలోని వేల కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన 110 మత్స్య కారుల సొసైటీలు ఉండగా, ఇందులో 5,920 మంది మత్స్య కార్మికులు సభ్యులుగా ఉన్నారు. మరో 2 వేల మంది వరకు గుర్తింపు లేని కార్మికులు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. రెండు ఎకరాల విస్తీర్ణం చెరువు ఒక్కరి చొప్పున మత్స్య కార్మికులను ప్రభుత్వం గుర్తిస్తూ కనీసం 20 మంది సభ్యుల నుంచి 200 మంది సభ్యులతో కూడిన సొసైటీలను ఏర్పాటు చేసింది. ఫరూఖ్‌నగర్, కేశంపేట, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, రాజేంద్రనరగ్, శంషాబాద్చ చేవేళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలతో పాటు జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న ప్రాంతాల మత్స్య కార్మికులు చేపల విక్రయాలపై జీవనోపాధి పొందుతున్నారు.
మత్స్య కార్మికులకు సర్కారు ప్రోత్సాహం..
రాష్ట్రంలోని మత్స్య సంపదను మరింత పెంచి మత్స్యకార్మిక కుటుంబాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీలను అందిస్తున్నది. ప్రభుత్వ గుర్తింపు పొందిన మత్స్య కారుల సొసైటీలకు చేపల వ్యాపారం చేసేందుకు, చేపల సాగును ప్రోత్సహించేందుకు అవసరమయ్యే మౌలిక వసతులను రాయితీతో అందిస్తున్నది. 75 శాతం రాయితీతో టీవీఎస్ మోటర్ వాహనాలు, చేపల వలలు, తెప్పలు, టాటా ఏస్ వాహనాలు, డీసీఎం వాహనాలను సమకూర్చుతున్నారు. ఒక్కో కార్మికుడికి రూ. 6 లక్షల బీమాను కల్పిస్తున్నారు. చేప పచ్చళ్లను తయారు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. చేపల ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటుకూ ఆర్థిక సాయం పొందవచ్చు. రీ సైక్లింగ్ అక్వా సిస్టమ్‌తో చేపలను పెంచేందుకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం, సాధారణ వర్గాల మహిళలకు 50 శాతం రాయితీతో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపల విక్రయాలను చేసేందుకు రూ.10 లక్షల విలువ చేసే వాహనాలను 60 శాతం రాయితీతో వ్యాపారులకు అందిస్తున్నారు. ఇలా మత్స్య కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది.
600 చెరువుల్లో చేప పిల్లలు…
ఈసారి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. 1.70 కోట్ల చేప పిల్లలను జిల్లాలో కనీసం 600 చెరువుల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. మరో 20 రోజుల్లో అన్ని చెరువుల్లోకి చేప పిల్లలు చేరనున్నాయి.
సొసైటీలు బలోపేతం కావాలి..
గ్రామీణ ప్రాంతాల్లోని సొసైటీలు బలోపేతం కావాలి. ఉచిత చేపల పిల్లల ప్రభుత్వ పథకం చాలా బాగుంది. గ్రామాల్లో మత్స్య కారులకు సోసైటీ భవనాలు ఉంటే బాగుటుంది.