సర్కార్ సారె చేతికందిన వేళ ఆడపడుచుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రంగు రంగుల చీరను భుజంపై వేసి చూసుకొని మురిసిపోయారు. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి, వికారాబాద్ జిల్లా కేంద్రం, నవాబుపేట్‌లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బతుకమ్మ కానుకల పంపిణీని ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్లు తీగల అనితారెడ్డి, సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌తో కలిసి మంత్రి మహిళలకు కానుకలు అందజేశారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. చీరలు అందుకున్న ఆడపడుచులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
చాలా బాగున్నాయి..
బతుకమ్మ పండుగకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు రకరకాల డిజైన్లలో కలర్ఫుల్గా ఎంతో బాగున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం పెరగడంతోపాటు మంచి గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు ఏ సర్కార్ పండుగలకు కానుకలివ్వలేదు. మహిళల బాగుకోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆడబిడ్డల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేశారు.
-ఇంద్రపాటి మాధవి,చిలుకూరు,మొయినాబాద్
షాబాద్/పరిగి, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా చీరలను అందజేస్తుందని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మున్సిపాలిటీలోని మణిగార్డెన్లో, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వేర్వేరుచోట్ల జరిగిన చీరల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో బతుకమ్మ పండుగకు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కిందన్నారు. ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. అన్ని పండుగలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్, క్రిస్మస్కు కానుకలను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడాది రూ. 318 కోట్లతో మహిళలకు ఒక కోటీ 8లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న సందర్భంగా అధికారులు చీరలు పంపిణీకి సిద్ధం చేశారన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈసారి 19రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 వర్ణాలతో సరికొత్తగా చీరలను రూపొందించారన్నారు. దాదాపు 16వేల మగ్గాలపై పదివేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశారన్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 7,28,154 చీరలు, వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 3,29,000 చీరలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పి.సునితా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పండుగలకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ప్రభాకర్, మేనేజర్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో సత్తయ్య, తాసిల్దార్ కృష్ణకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్, మున్సిపాలిటీ అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత, నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, పార్శి బాలకృష్ణ, పాండురంగారెడ్డి పాల్గొనగా, వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, జాయింట్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ చైర్పర్సన్ దీపా భక్తవత్సలం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.