పకడ్బందీగా వానకాలం పంటల సాగు
వివరాల సేకరణకు సర్వే
క్షేత్రస్థాయిలో ఏఈవోల పరిశీలన
ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నదనే వివరాల నమోదు..
ఎప్పటికప్పుడు పోర్టల్లో ఎంట్రీ..
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని పక్కాగా తేల్చేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వే నంబర్ ఆధారంగా పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమిలో ఏ రైతు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేశారనేది నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పంట దిగుబడులను అంచనా వేసి.. అందుకనుగుణంగా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. పంటలను ఏఈవోలు క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలు సేకరించడంతోపాటు ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2 : రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలం సీజన్లో రైతులు తమ పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా వరిసాగు విస్తీర్ణం ఏ మేరకు చేపట్టారన్న విషయమై క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యవసాయశాఖ సిబ్బంది క్లస్టర్ల వారీగా పర్యటిస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. రైతుబంధు సమితి సభ్యులు సైతం ఈ సర్వేలో భాగస్వాములవుతున్నారు. ఈ వానకాలంలో వర్షాలు విస్తారంగా కురియడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. వరిసాగు విస్తీర్ణానికి సంబంధించి పక్కా సమాచారం రాబట్టే పనిలో వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, షాద్నగర్, తలకొండపల్లి, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, అబ్దుల్లాపూర్మెట్, నందిగామ, కొందుర్గు, కడ్తాల్, కేశంపేట్, ఆమనగల్లు తదితర మండలాల్లో వరిసాగు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీగా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలను నమోదుచేసి పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు వ్యవసాయశాఖ గ్రామాల వారీగా పక్కాగా వివరాలు సేకరిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో..
ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుండటంతో ఈ వానకాలంలో సాగు అధికంగా పెరిగింది. వరిలో దొడ్డు, సన్నరకాలు, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు ఏయే పంటలను ఎన్ని ఎకరాల్లో సాగుచేశారనే వివరాలను సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 30 నుంచి 40వేల ఎకరాల్లో వరిసాగు చేస్తే, ఈ ఏడాది సుమారు 80వేల ఎకరాల్లో వరిపంటలు సాగుచేసే అవకాశముందని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. వరితో పాటు ఇతర కూరగాయల పంటలను కూడా పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్నారు.
పక్కాగా పంటల లెక్క..
సాగుచేసే పంటల వివరాలను అధికారులు పక్కాగా నమోదు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పంటల సాగు వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా నమోదు చేయిస్తున్నది. దీంతో ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అధికారులకు పంటల వివరాలు చెప్పాలి
వానకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను సర్వేనంబర్ల వారీగా వ్యవసాయశాఖ సిబ్బంది, రైతుబంధు సమితి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి వస్తున్నది. వ్యవసాయపొలాల వద్దకు వచ్చే వ్యవసాయాధికారులకు రైతులు సహకరించి పంటల వివరాలు తెలియజేయాలి.