నేటి నుంచి అందుబాటులోకి బాటసింగారం పండ్ల మార్కెట్ నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని లాజిస్టిక్పార్కుకు తరలించారు. నేటి నుంచి పండ్ల క్రయ విక్రయాలన్నీ ఇక్కడినుంచే జరుగనున్నాయి. దీంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొన్నది. రూ.90లక్షల వ్యయంతో 44ఎకరాల్లో సకల సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. భారీ గోదాంలు, కోల్డ్ స్టోరేజీలు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. కొనుగోలుదారులు, వ్యాపారులు, రైతులు, హమాలీలు, డ్రైవర్లు ఇలా అందరినీ దృష్టిలో ఉంచుకొని వసతులు ఏర్పాటు చేశారు. మొత్తం 341మంది వ్యాపారులు, రైతులు క్రయవిక్రయాలు జరిపేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే బ్యాంకు, దవాఖాన, పెట్రోల్‌బంకు, పోలీసు ఔట్‌పోస్టు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. అలాగే రా్రత్రుల్లో వచ్చే పండ్ల లారీలను పార్కింగ్ చేసేందుకు ఫ్లడ్‌లైట్లు, డ్రైవర్లు సేద తీరేందుకు విశ్రాంతి భవనం, భోజనం చేసేందుకు క్యాంటిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం, అతిపెద్ద ధర్మకాంట, విద్యుత్ సమస్య తలెత్తినా ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ నగరశివారులో ఉండడంతో రవాణా ఇబ్బందులు కూడా తీరనున్నాయి.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30 : నగరంలోని చైతన్యపురిలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శుక్రవారం నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారంలోని లాజిస్టిక్పార్కులో ప్రారంభించనున్నారు. ఇకనుంచి క్రయ విక్రయాలన్నీ ఇక్కడినుంచే జరుగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో ఉన్న పండ్ల మార్కెట్ 22 ఎకరాల్లో మాత్రమే ఉండగా, ప్రస్తుతం బాటసింగారంలో 44ఎకరాల్లో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారులకు, రైతులతో పాటు హమాలీలు, డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల వసతులు కల్పించారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ను అధికారులు ఇప్పటికే మూసివేశారు. క్రయ విక్రయాలు కూడా పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం నుంచి వ్యాపారులు బాటసింగారం పండ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రూ.90లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్లో రైతులకు వ్యాపారులకు కావల్సిన పూర్తి సదుపాయాలను కల్పించారు. మార్కెట్లో బ్యాంకు సౌకర్యంతో పాటు దవాఖాన, పోలీస్ఔట్పోస్టు, వ్యాపారులు, రైతులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే, రాత్రి సమయంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల లారిలన్నీ కూడా పార్కింగ్ చేసుకునేందుకు ప్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశారు. 8 ఎకరాలల్లో బత్తాయి, బొప్పాయి, పుచ్చకాయను విక్రయించుకునేందుకు గానూ 148మంది వ్యాపారులకు అతిపెద్ద స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, 50వేల ఎసెప్టీ సామర్థ్యంగల గోడౌన్లో ఆక్సిస్బ్యాంకు, ప్రైమరీ హెల్త్‌సెంటర్, కార్యాలయ భవనం, రైతులు, వ్యాపారులు, హమాలీలు సేదతీరేందుకు వసతి వంటి సౌకర్యాలను కల్పించారు. అలాగే, 22వేల ఎసెప్టీలో 42మంది కమీషన్ ఏజెంట్లకు వారు ఇతర దేశాలకు పండ్లను ఎగుమతి చేసుకునేందుకు వాటిని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేశారు. కోల్డ్‌స్టోరేజీలో ఆపిల్, దానిమ్మ, సపోటా వంటి పండ్లను నిల్వ ఉంచుకునేందుకు వీలు కల్పించారు. అలాగే, మరో 50వేల ఎసెప్టీ గల గోడౌన్లో 129మంది రైతులకు తాము పండ్లను క్రయ విక్రయాలు జరుపుకునేందుకు స్థలాలను కేటాయించారు. మరో ఎకరా స్థలంలో పైనాపిల్స్ వ్యాపారం జరుపుకునేందుకు వీలుగా 30మందికి ప్రత్యేకంగా నిర్మించిన షెడ్డును ఏర్పాటు చేశారు. మొత్తం 341మంది వ్యాపారుల కోసం స్థలాలను కేటాయించారు. ఈ వ్యాపారులంతా వచ్చి తమ వ్యాపారులను సవ్యంగా జరుపుకునేందుకు పూర్తి భరోసాను అధికారులు కల్పించారు.
నూతన మార్కెట్లో సౌకర్యాలు..
నూతనంగా ఏర్పాటు చేస్తున్న బాటసింగారం మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు, కమీషన్ ఏజెంట్లకు, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గోదాములను కేటాయిస్తున్నారు.
వ్యాపారులు, రైతులు, హమాలీలు, వాహనదారులకు అనుకూలంగా బ్యాంకు సౌకర్యం కూడా కల్పించారు.
రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం అతిపెద్ద ధర్మకాంటను ఏర్పాటు చేశారు.
అలాగే, రైతులు, వ్యాపారులు, హమాలీలకు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యాంటిన్ సౌకర్యం.
వాహనదారుల సౌకర్యం మేరకు మార్కెట్ సమీపంలోని పెట్రోల్‌బంక్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మార్కెట్ సమీపంలోని పోలీసు ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు.
మార్కెట్‌కు వచ్చే రైతులు, హమాలీలు, వ్యాపారులకు వైద్య సౌకర్యం కోసం దవాఖాన ఏర్పాటుతో పాటు ఉచితంగా మందులను కూడా అందజేయనున్నారు.
నూతనంగా నిర్మించిన మార్కెట్లోకి వచ్చేవారికి అవసరాల మేరకు తాగునీరు, మూత్రశాలలను ఏర్పాటు చేశారు.
మార్కెట్లో ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తినా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
విశాలమైన రోడ్లు..
మార్కెట్లో వాహనాల రాకపోకలకు వీలుగా విశాలమైన రోడ్ల సౌకర్యం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పండ్లను తీసుకువచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మార్కెట్లోని అతిపెద్ద ధర్మకాంటను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, డ్రైవర్లు సేదతీరేందుకు వీలుగా క్యాంటిన్ సౌకర్యంతో పాటు విశ్రాంతి భవనం కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారికి అతిసమీపంలోనే మార్కెట్ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు ద్వారా వచ్చి పెద్ద అంబర్పేట్ వద్ద దిగి నేరుగా పండ్ల మార్కెట్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది.
తీరనున్న రవాణా సమస్య..
ప్రస్తుతం ఉన్న గడ్డిఅన్నారం మార్కెట్లోకి రాత్రి సమయంలో మాత్రమే వాహనాలకు అనుమతి ఉండేది. ఉదయం 8గంటల తరువాత వచ్చిన వాహనాలన్నీ రాత్రి 10గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కాని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న బాటసింగారం పండ్ల మార్కెట్ నగరశివారులల్లో ఉండటం వలన ఈ ప్రాంతంలో ఎలాంటి రవాణా ఆంక్షలు ఉండవు. అలాగే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పండ్లను తీసుకువచ్చే వాహనాలు ఎప్పుడైనా ఔటర్‌రింగ్‌రోడ్డు ద్వారా మార్కెట్లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. బెంగళూరు, ముంబాయి, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా పెద్దఅంబర్‌పేట్ ఎగ్జిట్ వద్ద దిగి మార్కెట్‌కు చేరుకోవచ్చు.
సకల సౌకర్యాలు కల్పించాం
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం వద్ద నూతనంగా నిర్మించిన పండ్ల మార్కెట్లో సకల సౌకర్యాలు కల్పించాం. వ్యాపారులు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి తమ క్రయ విక్రయాలను జరుపుకోవాలి. కొంతమంది సౌకర్యాలు లేవని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తమ పండ్లను తీసుకువచ్చే రైతులకు అవసరమైన పూర్తి సదుపాయాలు మార్కెట్లో ఉన్నాయి. అలాగే, విదేశాలకు ఎగుమతి చేసే పండ్లను కూడా నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్ సౌకర్యం కూడా ఉన్నది. అలాగే, బొప్పాయి, పుచ్చకాయ, బత్తాయి వంటి పండ్లను విక్రయించుకునేందుకు 8ఎకరాల స్థలాన్ని కేటాయిచాం. వ్యాపారులు, రైతులు నిర్భయంగా ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుకోవాలి.