కొత్తూరు, ఆగస్టు 31 : ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న రోజులివి. పర్యావరణానికి ప్రమాదంగా పరిణమిస్తున్న ఈ కాంక్రీట్ కట్టడాలను దూరంగా పర్యావణ అనుకూల కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి కోవకు చెందినదే ఈ కొత్తూరు ఎకో ఫ్రెండ్లీ స్కూల్ బిల్డింగ్. ఈ పాఠశాలను సీఎస్ఈబీ (కంప్రెస్డ్ స్టెబిలైజ్స్ ఎర్త్ బ్యాక్స్) పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఇటుకలను ఎర్రమట్టి, డస్ట్, సిమెంట్, సున్నం కలిపి అచ్చుల్లో వేసి తయారు చేస్తారు. ఇందులో 45 శాతం ఎర్రమన్ను, 45 శాతం డస్ట్, కేవలం 10 శాతం మాత్రమే సిమెంట్ ఉపయోగిస్తారు. అందువల్ల బయటికంటే తక్కువ ఉష్ణోగత్ర ఇందులో నమోదవుతుంది. కాంక్రీట్ బిల్డింగ్ కన్నా 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఈ భవనాల్లో ఉంటుంది. సిమెంట్, స్టీల్ అతి తక్కువ మోతాదులో వాడడంతో దీన్ని పర్యావరణ అనుకూల కట్టడంగా పేర్కొంటారు. పైల్ ఫౌండేషన్ పద్ధతిలో తయారు చేసే ఈ ఇటుకలకు మామూలుగా తయారు చేసే ఇటుకలకన్నా 3 రెట్లు అధిక దృఢంగా ఉంటుంది. కాంక్రీట్‌తో నిర్మించే భవనం కన్నా 30 శాతం తక్కువ ఖర్చుతోనే దీన్ని నిర్మించవచ్చు. ఈ ప్లాన్‌ను బంజారాహిల్స్‌కు చెందిన కృతిక కన్స్ట్రక్షన్కు వారు రూపొందించారు.
రూ. 3.5 కోట్లతో నిర్మాణం
ఈ పర్యావరణ అనుకూల భవనాన్ని నాట్కో ట్రస్ట్ 3.5 కోట్లను ఖర్చు చేసి నిర్మిస్తున్నది. మొత్తం జీఫ్లస్2 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనంలో మొత్తం 12 క్లాస్ రూమ్‌లు, 3 స్టాఫ్ రూమ్‌లు ఉంటాయి. ఇందులో పై కప్పుకు ప్రీకాస్ట్ రూఫ్ ప్యానల్స్‌ను వాడుతున్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఈ ప్యానల్స్ 1000 వరకు ఇక్కడే తయారు చేసి వాడుతున్నారు. ఈ ప్యానల్స్‌లో కూడా తక్కువ మోతాదులో స్టీల్ వాడుతారు.
100 ఏండ్ల వరకు దృఢంగా..
ఈ నిర్మాణం సుమారు 100 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటుందని ఈ ప్లాన్ తయారు చేసిన కృతిక కన్స్ట్రక్షన్ కంపెనీ వారు చెబుతున్నారు. ఇటుకలు, రూఫ్ ప్యానల్స్‌ను ఇక్కడే తయారు చేయడం, తయారు చేసిన వాటిని క్రేన్ సహాయంతో బిల్డింగ్ పైకి తరలించడం కొంత శ్రమతో కూడకున్న పని.
అందువల్ల దీని నిర్మాణానికి కొంత సమయం ఎక్కువగా
తీసుకుంటుందన్నారు. ఈ కొత్తూరు స్కూల్ భవన నిర్మాణాన్ని 2019, నవంబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం భవనం తయారు కావడానికి మరో 10 నెలలు పడుతుందని నాట్కో ట్రస్ట్ వారు చెబుతున్నారు.
అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నాం
ఈ ఎకో ఫ్రెండ్లీ స్కూల్ భవనాన్ని అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నాం. కాంక్రీట్ భవనాల్లో వాడే సిమెంట్, స్టీల్‌ను చాలా తక్కువ మోతాదులో ఉపయోగిస్తాం. ఇక్కడ వాడే ఇటుక మామూలు ఇటుక కన్నా మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. సాధ్యమైనంత తొందరలో ఈ భవనాన్ని నిర్మించి ఉపయోగంలోకి తెస్తాం.
-రాంబాబు, నాట్కో ట్రస్ట్ మేనేజర్