రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మల్లాపూర్,11 గంటలకు సారంపల్లి, 11.30 గంటలకు అంకుషాపూర్, మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. చౌరస్తాలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని ఆధునీకరించిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని అదనపు సౌకర్యాల నిర్మాణాలను, సుందరీకరణను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు బైపాస్‌రోడ్డులోని నర్సింగ్ కళాశాల పక్కన నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారు. భవనంలోని వేదికపై దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఎంఈవో మంకు రాజయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి సంస్మరణ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వడ్ల కొనుగోలుకు సంబంధించి అధికారులతో సమీక్షిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.