
ఖమ్మం వ్యవసాయం, జనవరి 12: ఖమ్మం జిల్లాలో యాసంగి రైతుబంధు పంపిణీ సొమ్ము రూ.284.14 కోట్లకు చేరింది. గడిచిన పదిరోజులుగా విడతల వారీగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఈ యాసంగి సీజన్‌కు అర్హత కలిగిన 3,16,422 మంది ఉండగా వారికి రూ.362.84 కోట్లను అందజేయాలని సర్కారు నిర్ణయించింది. విడతల వారీగా తొలుత సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తూ పంపిణీ చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 2,94,397 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.284.14 కోట్లను జమ చేసింది. మిగిలిన రైతుల ఖాతాల్లోనూ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు సొమ్ము జమ కానున్నది.
62 వేల ఎకరాలకు చేరిన యాసంగి సాగు
పంటల సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతుబంధు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుండడం, ఆ సాయం రూ.50 వేల కోట్లు దాటడంతో రైతులంతా వాడవాడలా రైతుబంధు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావడంతో వేడుకలు అంబురాన్నంటాయి. ఇదే ఉత్సాహంతో రైతులు ఇతర పంటల సాగుకు ఆసక్తి చూపించారు. జిల్లాలో ఇప్పటి వరకూ మొదలైన యాసంగి సాగులో మొక్కజొన్న ప్రధాన పంటగా ఉంది. పంటల పెట్టుబడి సకాలంలో చేతికి రావడంతో ఆ ప్రభావం సాగు విస్తీర్ణంపై పడింది. దీంతో ఇప్పటి వరకూ యాసంగి సాగు విస్తీర్ణం 62,892 ఎకరాలకు చేరుకోవడం విశేషం. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం మక్క సాగు 46,356 ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో ఇదే ప్రధాన పంటగా ఉంది. వరి 12,289 ఎకరాల్లో, వేరుశనగ 1,606 ఎకరాల్లో, పెసర 1,006 ఎకరాల్లో, మినుము 726 ఎకరాల్లో, చెరకు 412 ఎకరాల్లో, ఇతర పంటలు మరో 500 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 1.80 నుంచి 2 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.