
రఘునాథపాలెం, జనవరి 13: అన్నదాతల వ్యవయానికి పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ గోదాంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముందుగా రైతుబంధు ఆకారాలతో వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాల మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే రైతుల కోసం సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించారని గుర్తుచేశారు. తరువాత అన్నదాతల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి అనేక బృహత్తర పథకాలను తీసుకొచ్చి విజయవంతగా అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య మాట్లాడుతూ సహకార సొసైటీల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీఏవో విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసరావు, సంస్థ మేనేజర్, ఉద్యోగులు, పాల్గొన్నారు.