సంక్రాంతికి ముందే అన్నదాత ఇంట పండుగ కనిపిస్తున్నది. ‘రైతుబంధు’వొచ్చిన వేళ సంబురం అంబురాన్నంటుతున్నది. గురువారం వరకు 6,35,570 మంది రైతుల ఖాతాల్లో రూ.592.23 కోట్లు జమ కాగా, ఊరూరా అభిమానం వెల్లువెత్తుతున్నది. ఆది నుంచీ వెంటే ఉంటూ.. పెట్టుబడులకూ సాయాన్ని ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు కర్షకలోకం జైకొడుతున్నది. ఊరూరా ‘నీ వే మా దేవుడివి’ అంటూ పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు చాటుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎడ్లబండ్లతో ర్యాలీలు తీసింది. పలు చోట్ల రంగవల్లులతో తెలంగాణ చిత్రపటం వేసి, ‘జై కేసీఆర్’ అక్షరాకృతులతో తమ అభిమానాన్ని చాటుకున్నది.
కరీంనగర్ నెట్వర్క్, జనవరి 13: ఎనిమిదో విడుత రైతుబంధు నగదు పంపిణీ చివరి దశకు చేరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,35,570 మంది రైతులకు రూ.592.23 కోట్లు జమ చేసింది. తమ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి నగదు జమవుతుండడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం ఆర్బీఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాలకు చెందిన రైతులు నాయకులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లలో తరలివచ్చారు. దారి పొడవునా పటాకులు కాల్చి ‘జై సీఎం కేసీఆర్, జై రైతుబంధు’ అంటూ నినదించారు. రైతులు, నాయకులు నృత్యం చేశారు. ఓదెల మండలం నాంసానిపల్లిలో మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన చెరువులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంపులలో ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. లంబాడితండా, గుంపుల, ఇందుర్తిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎలిగేడు మండలకేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక జమ్మినుయ్యి నుంచి గ్రామ అంబేద్కర్ కూడలి దాకా ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం నిర్వహించి పాలాభిషేకం చేశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన టీఆర్ఎస్వై నేత సిలువేరి చిరంజీవి దంపతులు సంక్రాంతి పర్వదినం సందర్భంగా చకినాల పిండితో ‘జై కేసీఆర్..రైతు బంధు’ అని రాసి ఆనందం వ్యక్తం చేశారు. మానకొండూర్ మండలం కొండపల్కల రైతులు, మహిళలు రంగవల్లులతో తెలంగాణ చిత్రపటాన్ని వేసి మధ్యలో కేసీఆర్ అక్షరాలను రాశారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపలి ్లగ్రామంలో ఏఈవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో మహిళా రైతులు, విద్యార్థినులు రంగవల్లులు వేశారు.