కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో సామాన్యులు కుదేలవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు గురువారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారులపై టోల్ చార్జీల అదనపు బాదుడు కూడా మొదలైంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కో వాహనానికి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.105 వరకు వసూలు చేయనున్నారు. ఏ రకంగా చూసినా వీటి ప్రభావం సాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 31(నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల పుణ్యమా అని ఐదు నెలలుగా పెరుగని పెట్రో ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదల ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని ఇన్నాళ్లు పెంచుకుండా జాగ్రత్త పడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని కలిపి బాదేందుకు సిద్ధ్దపడింది. పెట్రో ఉత్పత్తుల ధరలు గత నెల 23 నుంచి వరుసగా నిరాటంకంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో రోజు లీటర్ ఒక్కంటికి 50 పైసల నుంచి రూపాయికి మించి పెరుగుతున్నది. దాంతో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కాగా, డీజిల్ రూ101.53 నమోదైంది. పది రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.7.22 పైసలు, డీజిల్‌పై రూ.6.95 పైసల చొప్పున పెరిగింది.
జిల్లాలో వాహనదారులపై ప్రతి రోజూ లక్షలాది రూపాయల అదనపు భారం పడుతున్నది. ఉమ్మడి జిల్లాలో రోజూ 3 లక్షల లీటర్ల పైచిలుకు పెట్రోల్, 15 లక్షల పైచిలుకు డీజిల్ వినియోగిస్తున్నట్లు అంచనా. దీని ప్రకారం లెక్కిస్తే.. పెట్రోల్‌పై పెరుగుదల వల్ల నిత్యం రూ. 22 లక్షలు, డీజిల్‌పై రూ. కోటికి పైగా భారం పడుతున్నట్లే. వీటి ప్రభావం ఇక అన్ని రకాల సరుకు రవాణాపై పడుతున్నది. దాంతో నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే కరోనా ప్రభావంతో అంతంతమాత్రంగా నడుస్తున్న లారీలు, ఇతర ట్రాన్స్‌పోర్టు వాహనాలపై మోయలేని భారంగా మారింది. చాలా మంది ట్రాన్స్‌పోర్టు వాహనాలను రోడ్లెక్కించడం కంటే ఆపుకోవడమే బెటర్ అనే పరిస్థితుల్లోకి వస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ట్రాన్స్‌పోర్టు కిరాయిలు పెరగకపోవడంతో ఆ భారమంతా యజమానులపైనే పడుతున్నది. దీని వల్ల ట్రాన్స్‌పోర్టు రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయి.
జాతీయ రహదారులపై టోల్ రుసుం పెంపుదల కూడా అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై మూడు చోట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద జీఎంఆర్ సంస్థ టోల్‌ప్లాజాలను నిర్వహిస్తుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలం గూడురు వద్ద కూడా టోల్‌ప్లాజా ఉన్నది. వీటి పరిధిలో ఎన్హెచ్ఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే టోల్ చార్జీల వడ్డన మొదలైంది. వాహన సామర్థ్ధ్యాన్ని బట్టి కనిష్ఠంగా ఒక్కో వాహనంపై రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.105 వరకు చార్జీల పెంచింది.
కార్లకు ఇప్పటివరకు సింగిల్ జర్నీకి రూ.80 వసూలు చేయగా రూ.10 పెంచి రూ.90 తీసుకుంటున్నారు. భారీ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.510 నుంచి 560కి టోల్ రుసుము పెంచారు. ఇలా రిటర్న్ జర్నీలో ఒక్కో భారీ వాహనంపై రూ.80 అదనపు భారం పడనుంది. ఇక నెలావారీ పాసులపైనా భారీగానే పెంపుదల కనిపించింది. భారీ వాహనానికి పంతంగి టోల్‌ప్లాజా వద్ద నెలవారీ పాసుపై రూ.1730 అదనంగా పెరిగింది. కోర్లపహాడ్, గూడురు టోల్‌ప్లాజాల్లో పెంపు ఇప్పటికే అమలవుతున్న రుసుములపై అదనంగా రేట్లను పెంచి వసూళ్లు ప్రారంభి ంచారు. దీంతో ఓ వైపు పెట్రోల్, డీజిల్ భారంతో ఒడిదుడుకులకు లోనవుతున్న వాహనదారులు టోల్ రుసుముల అదనపు భారంగా మారాయి.
వంటగ్యాస్పైనా పది రోజుల క్రితం ఒకేసారి రూ. 50 పెంచడంతో అది కాస్తా వెయ్యి మైలురాయిని దాటింది. జిల్లాలో రూ.970.50 ఉన్న 14.2 కిలోల గ్యాస్‌బండ రూ.1020కి చేరింది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో సామాన్యులపై భారీగా భారం పడుతున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటి పరిధిలో 9.57 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్‌పై అదనపు పెంపుదల వల్ల నెలకు సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడు తున్నట్లు అంచనా. ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ పెట్రో ఉత్పత్తుల ధరలు మండు వేసవికి మించి సెగను పుట్టిస్తున్నాయి.