
నల్లగొండ ప్రతినిధి, జనవరి13(నమస్తే తెలంగాణ) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. ఇప్పటికే ఉన్న చలి ప్రభావానికి వర్షంతో వీస్తున్న చల్లనిగాలులు తోడయ్యాయి. దాంతో ప్రజలు వణికిపోతున్నారు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 11.5మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లాలో 21, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7.4మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు ఇదే రకమైన పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి వర్షం మొదలైంది. గురువారం రోజంతా వర్ష ప్రభావం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో 57.8మి.మీటర్ల వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. నాళాలు ఉధృతంగా ప్రవహించగా లోతట్టు ప్రాంతాల మీదుగా వరద నీరు ప్రవహించింది. గురువారం సాయంత్రానికి కొంత తెరిపినిచ్చింది. చండూర్లో 36.9మి.మీ.వర్షం కురవగా దామరచర్లలో 31.4మి.మీ, నాంపల్లిలో 31.2, నిడమనూరులో 30.1, త్రిపురారంలో 27.1, మిర్యాలగూడలో 23.2, మాడ్గులపల్లిలో 20.9మి.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శాలిగౌరారం, కనగల్, మునుగోడు, అనుముల మండలాల్లో 10మి.మీటర్ల కంటే ఎక్కువగానే వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, తిప్పర్తి, వేములపల్లి, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్, పెద్దవూర, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు, పీ.ఏ.పల్లి, నేరేడుగొమ్మ, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో 10మి.మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్ 1నుంచి గురువారం నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 659మి.మీటర్లు కాగా ఇప్పటివరకు 866.9మి.మీటర్ల కురిసి 31.5శాతం అదనంగా నమోదైంది. త్రిపురారం మండలం మాటూరు వద్ద వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కనగల్ మండలంలో కురిసిన వర్షంతో దర్వేశిపురం వద్ద ఉన్న పుష్కరఘాట్ వాగు ఉధృతంగా ప్రవహించింది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో మెజార్టీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నూతనకల్ మండలంలో 74.5మి.మీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూర్(ఎస్)లో 59.6మి.మీ, నాగారంలో 58.3, తుంగతుర్తిలో 45.2, మోతెలో 38.3, మద్దిరాలలో 32.9, సూర్యాపేటలో 27.3, అర్వపల్లిలో 27, పెన్పహాడ్లో 21.8, చివ్వెంలలో 20.3, తిరుమలగిరిలో 15.3, గరిడేపల్లిలో 13.6, కోదాడ, నేరడుచర్లలో 11.4, మునగాలలో 8, చిలుకూరులో 6.9, నడిగూడెంలో 4.1, చింతలపాలెంలో 3.8, మట్టంపల్లిలో 3.3, మెళ్లచెర్వులో 2.8, అతితక్కువగా హుజూర్నగర్లో 0.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో జిల్లాలో కొన్నిచోట్ల పత్తి చేలపై ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తికి కొంత మేర నష్టం వాటిల్లింది. పత్తి తడిసి నల్లబారితే ధర రాదని రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజులు కూడా ఇదేరకమైన వాతావరణం ఉండవచ్చని తెలుస్తోంది. ప్రజలు చల్లని వాతావరణం నుంచి రక్షణ చర్యలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్త్తరుగా..
భువనగిరి కలెక్టరేట్, జనవరి 13 : జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురిసింది. అత్యధికంగా భువనగిరిలో 41.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని తుర్కపల్లి(ఎం)లో 12.4, రాజాపేటలో 5, ఆలేరులో 8.6, యాదగిరిగుట్టలో16.4, భువనగిరిలో 41.6 వలిగొండలో 11.6. ఆత్మకూర్(ఎం)లో 10.2, మోత్కూర్లో 2.2, గుండాలలో 2.8 చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లావ్యాప్తంగా 7.4 మిల్లి మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. చలిగాలులు వీస్తుండడంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.