
ఇంటింటా ముత్యాల ముగ్గులు.. ముచ్చటగొలుపు గొబ్బెమ్మలు.. పిండివంటల ఘుమఘుమలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. పతంగుల రెపరెపలతో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లాపాపలతో చేరుకోగా ఊరూవాడా కళకళలాడుతున్నది. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమను కనుల పండువగా జరుపుకునేందుకు ప్రతి ఇల్లూ ముస్తాబైంది.
బజార్హత్నూర్, జనవరి 13 :సంక్రాంతి మూడు రోజుల, సకల సౌభాగ్యాల పండుగ. సూర్యున్ని ప్రత్యేకంగా పూజించే పర్వదినం. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజులను ప్రతి ఇంట్లో ఎంతో సంబురంగా జరుపుకుంటారు. ఏడాదిలో 12 సార్లు 12 రాసుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. శరీరానికి ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా, అన్ని విధాలా ఆరోగ్యమైనదీ పండుగ. వాకిళ్లకు వర్ణకాంతులను, ఇంటిల్లిపాదికీ సకల సౌభాగ్యాలను మోసుకొస్తుంది. గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, పతంగుల ఆటలు.. ఇళ్లకు చేరిన బంధువులు, ముఖ్యంగా రైతన్నకు చేరే పంట సిరులతో ఊరూరా సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. పిండి వంటలతో ప్రతి ఇంట్లో ఘుమఘుమలాడుతుంది. శుక్రవారం భో గి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ కనుల పండువగా జరుపుకునేందుకు జనం సిద్ధమైంది.
ముత్యాల ముగ్గులు..
మహిళలు, యువతులు పొద్దున్నే లేచి అలుకు జల్లి, రంగురంగుల ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజిస్తారు. గొబ్బెమ్మలో వాడే గరిక, తెల్లపిండి, ఆవు పేడ వల్ల ఒక రసాయనిక ప్రక్రియ జరిగి ఆరోగ్యానికి మేలు చేసే వాయువు వెలువడుతుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. అ లంకరణలున్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని చెబుతారు. శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం శుభ సూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నా పెద్దలను ఆకట్టుకుంటాయి.
నేడు భోగి..
సూర్యోదయానికి ముందే వేకువజామున ఇంటిముందు చలిమంటలు వేసి పిల్లలకు నూనె, గట్టి పిండితో నలుగుపెడతారు. సాయంకాలం చిన్నపిల్లలను ఇంట్లో అందంగా వేసిన ముగ్గులపై పీటపెట్టి దానిపై కూర్చోబెడతారు. చెంబులో రేగు పండ్లు, బియ్యం, చెరుకు ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, పోకలు (బియ్యం పిండితో చేసినవి), చిల్లర డబ్బులు పిల్లల నెత్తిపైనుంచి పోస్తారు. బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారిని పిలిచి దీవెనలిప్పిస్తారు. తెలంగాణలో ప్రత్యేకంగా చక్కిలాలు చేస్తారు. వచ్చిన వారికి వీటితో పాటు పండ్లను వాయినాలుగా ఇస్తారు.
సంక్రాంతి..
‘నమస్కార ప్రియ భాస్కర’ అన్నట్లు సంక్రాంతి నాడు సూ ర్యున్ని ఆరాధించాలి. సూర్యుడి యాత్ర దక్షిణాయాణం నుంచి ఉత్తరాయణం వైపు సాగుతుంది. సకల జీవరాసులు, చెట్లు, చీమలు, పాములు, పుట్టలు సూర్యరశ్మితో జీవిస్తున్నాయి. ఇటువంటి సూర్యున్ని ప్రత్యేకంగా పూజించేది సంక్రాంతి పండుగ. రైతుకు కొత్త పంటలు, వరి, నువ్వులు, బెల్లం ఇంటికి చేరి ధాన్యలక్ష్మి ‘సంక్రాంతి లక్ష్మి’గా దర్శనమిస్తుంది. పాడిపంటలతో పల్లె లు కనుల పండువగా ఉంటాయి. కొందరు పితృదేవతలకు తర్పణం ఇస్తారు. ప్రత్యక్షదైవమైన సూర్యునికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి, సూర్యోదయానికి ముందు పొంగలి చేస్తారు. ఆడపిల్లలు తెల్లవారకముందే కళ్లాపి చల్లి ముగ్గు లు వేస్తారు. మగ పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తారు. ముగ్గుల మధ్యలో ఆవు పేడను గొబ్బెమ్మలుగా చేసి బంతిపూలతో అలంకరిస్తారు. ఆ సమయంలో లభించే రేగుపండ్లు, చిక్కుడు కాయ లు, బియ్యం, నూలు వాటి చుట్టూ పోస్తారు. హ రిదాసులకు, గంగిరెద్దులవారికి ధాన్యాన్ని, డబ్బులను దానం చే స్తారు. ‘అయ్యగారికి దండంపెట్టు..మంచిజరగాలని దీవిం చు..’ అంటూ తలూపే గంగిరెద్దు దీవెనలు ఇంటింటా కన్పిస్తాయి.
కనులపండువగా కనుమ
ముచ్చటగా మూడో రోజు జరుపుకునేది కనుమ పండుగ. తెల్లవారకముందే ముత్తయిదువలు అందంగా అలంకరించుకొని సంక్రాంతి రోజే సంక్రాంతి పూర్ణానికి నూలు, బెల్లంతో చేసిన ఉండలు కానీ, నూల పొడి చక్కెర కానీ నైవేద్యంగా పెడ్తారు. సంక్రాంతి నోములని 13 వస్తువులు (నోములు), రేగుపండ్లు, చిక్కుడు కాయలు వేసి సమర్పిస్తారు. కనుమనాడు ముత్తయిదువలకు పసుపురాసి, బొట్టుపెట్టి ఒక్కొక్కరికీ నోము ఇస్తారు. చక్కెర, నువ్వుల పొడి చేతిలో పెట్టి ‘తీపి తిని తియ్యగా మాట్లాడు.. నూలు తిని నూరేళ్లు బతుకు’ అని దీవిస్తారు. పెద్ద ముత్తయిదువల దీవెనలందుకుంటారు. చలికాలం చలితో వణుకుతున్నవారికి నూలు, బెల్లం ఊష్ణాన్నందిస్తాయి.
సౌభాగ్య నోములు.. ఆలయాలు కిటకిట
సంక్రాంతికి మహిళలు బొమ్మల కొలువులు పెడతారు. సౌభాగ్యవంతులైన మహిళలు సంక్రాంతి నోములు నోచుకుని ముత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలుగా పంచిపెడుతారు. కలకాలం ద్వేషాలు తొలగి సంతోషాలతో కలిసి ఉందామని ఈ నోములు, వ్రతాలు చేస్తారు. సంక్రాంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించి, పూజలు చేస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. కొన్ని ప్రాంతాల్లో జాతరలు కూడా జరుపుకుంటారు. రైతులు పశువులను శుభ్రంగా కడిగి, ఎద్దుల బండ్లను అలంకరించి, ఇంటిల్లిపాదితో కలిసి జాతరకు, లేదా ఆలయాలకు వెళ్తారు.
పతంగుల పోటీలు..
సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. పిల్లలకు పాఠశాలలకు సెలవులు కావడంతో పండుగకు రెండు రోజుల ముందు నుంచే గాలిపటాలు ఎగురవేస్తూ సరదా తీర్చుకుంటారు. వీరి అభిరుచికి అనుగుణంగా విక్రయదారులు కాన్పూర్, న్యూఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విభిన్నరీతిలో ఉన్న పతంగులను దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు.
కరకర లాడే సకినాలు..
ప్రజలు సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. పిల్లల నుం చి పెద్దల వరకు ఇవంటే ఎంతో ఇష్టపడుతారు. వీటికి తోడు సం క్రాంతి పండుగకు గారెలు, అరిసెలు, మురుకులు, కారప్పూస కూడా చేసుకుంటారు. తమ బంధువులకు, మిత్రులకు పం పించి పండుగ పరమార్థాన్ని తెలియజేస్తారు.
మార్కెట్లు కళకళ..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, నగరవాసులతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. పల్లె ప్రజలు పూలు, మామిడి ఆకులు, మట్టి గురిగెలు, నవధాన్యాలు, రంగులు, ఆవుపేడ, చింతకాయలు అమ్మకానికి తేగా నగరవాసులు కొనుగోలు చేశారు.