
ఖమ్మం, జనవరి 12: సుడా పరిధిలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టినా, లే అవుట్లు వేసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. అక్రమ లే అవుట్ల అంశంపై సుడా పరిధిలోని ఎంపీడీవోలు, ఎంపీవో, గ్రామ కార్యదర్శులతో ఖమ్మంలోని సుడా కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుడా పరిధిలోని గ్రామాల్లో నిర్మించే ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్‌పై రెండు అంతస్తులు దాటినా, 300 చదరపు మీటర్ల స్థలం విస్తీర్ణం దాటినా టీఎస్ బీ-పాస్‌లో అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అటువంటి వాటికి గ్రామ పంచాయతీ అనుమతులు చెల్లవన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీం తరచూ నిర్మాణాలను తనిఖీ చేస్తుందని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనుమతులు పొందిన తరువాతనే నిర్మాణాలు చేపట్టుకోవాలని సూచించారు. సుడా సీపీవో సురేశ్‌బాబు, ఏపీవో ఇటికాల భాస్కర్, జేపీవో శ్రీనివాస్, టీపీవో సాయిరాం, టీపీఎస్ నరేశ్, సంతోశ్ పాల్గొన్నారు.