ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 130 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 25 వేలకు పైగా ఉద్యోగార్థులు హాజరుకావడంతో పరిసరాలు సందడిగా మారాయి. ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. 4వేల మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా నెలకు రూ.40 వేల వేతనంతో ఎల్బీనగర్కు చెందిన మల్లీశ్వరికి ప్రీమియర్ హెల్త్ కేర్ సెంటర్లో ఉద్యోగం లభించింది.
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11: ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ మేళాలో 130 కంపెనీలతో పాటు 25 వేలకు పాల్గొన్న యువతీయువకులు పాల్గొన్నారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి విద్యార్హతను బట్టి ఇంటర్వ్యూ నిర్వహించి అక్కడికక్కడే ఉద్యోగాలు ఇచ్చారు.
ఈ జాబ్‌మేళాలో ఎల్బీనగర్కు చెందిన అభ్యర్థి మల్లేశ్వరి ప్రీమియర్ హెల్త్‌కేర్ సెంటర్లో అత్యధికంగా రూ.40 వేల జీతంతో ఉద్యోగం సాధించింది. అపోలో ఫార్మాలో శిరీష (రూ.16 వేలు), ప్రీమియర్ హెల్త్ కేర్‌లో చంపాపేట్‌కు చెందిన చాంద్ పాషా (రూ.15 వేలు), మెడ్‌ప్లస్ సంస్థలో కొత్తపేటకు చెందిన నందిని (రూ. 10,500), దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రావణి (రూ.10.500) సైతం ఉద్యోగాలు సాధించారు. ఇలా కొన్ని కంపెనీలు అక్కడే అభ్యర్థులను ఎంపిక చేసి జీతాలు ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం దరఖాస్తులు తీసుకొని తర్వాత సమాచారం ఇస్తామని ప్రకటించాయి. మొత్తంగా అన్ని కంపెనీలు కలిపి ఒక్కరోజే నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి.
జాబ్‌మేళాకు భారీగా అభ్యర్థులు రావడంతో నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల తాకిడిని ముందుగానే ఊహించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇందుకనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు జాబ్‌మేళా ప్రాంగణంలోనే ఉండి అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూశారు.
ఆర్కేపురం, ఫిబ్రవరి 11: నిరుద్యోగ యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారిన పరిస్థితులకనుగుణంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే నగరాల్లో జీవించే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగులకు జాబ్‌మేళాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో మూగ, చెవిటి, దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌మేళాను నిర్వహిస్తామని ప్రకటించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతీయువకుల కోసం ఈ జాబ్‌మేళాను నిర్వహించామని తెలిపారు.
108 కంపెనీలు ముందుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. 13 వేల ఉద్యోగాలకు 30 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేళాలో అమ్మాఆయిలే అత్యధిక అవకాశాలు అందుకున్నారని.. అత్యధిక జీతం రూ.40 వేలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్‌గుప్తా, సెట్విన్ ఎండీ వేణుగోపాల్, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.