
ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కేసులు వారంలోనే ఆరు రెట్లు పెరిగాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్త చర్యలూ చేపట్టింది. గ్రామ స్థాయి నుంచి ఎంజీఎం, హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచింది. ఆరు జిల్లాల్లో కలిపి 1729 ఆక్సిజన్ బెడ్లు, 80 ఐసీయూ, 879 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి.
వ్యాక్సినేషన్ ముమ్మరం
వైరస్ నియంత్రణ కోసం బాధితులకు ఆరోగ్య పరంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమం కాగా 15ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో రోజూ ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నారు. 18ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే వంద శాతం దాటింది. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి కూడా వ్యాక్సికేషన్ పూర్తయ్యింది. అందుకే జనాభా కంటే ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పడింది. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 15 ఏళ్ల నుంచి 17ఏళ్ల వరకు ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులకు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు.
పండుగలు, జాతరల పూట జర భద్రం
సంక్రాంతి పండుగతో పాటు ఉమ్మడి జిల్లాలో ఐనవోలు, కొత్తకొండ జాతర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ సామూహిక వ్యాప్తికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడవద్దని, జాతర ప్రదేశాల్లో సామూహికంగా ఉండొద్దని చెబుతున్నది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకొని హోం ఐసొలేషన్లో ఉండాలని, ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లాలని సూచిస్తున్నది.