“జీవన హిందోళం”తో బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి అవధానాలు చేసే తీరును కండ్లకు కట్టినట్టు వర్ణించాడు. పాఠకులకు బాగా ఆసక్తిని కలిగించే విశేషాలను ఎంపిక చేసుకొని విసుగురాని శైలిలో వివరించారు. లక్ష్మీనరసింహశర్మ తన జీవితంలో 330 అవధానాలు చేయడం నిజంగా ఎంతో గొప్ప. ప్రసారమాధ్యమాలు, రవాణా సాధనాలు సరిగా లేని నలభై ఏండ్ల క్రితం అవధానిగా శర్మ తెలంగాణ అంతటా పర్యటించారు. పారితోషకాల్ని ఏనాడూ ఆశించలేదు. ఆనాటి తెలంగాణ ప్రాంతంలో అవధాని విశేషాలపై బాలశ్రీనివాసమూర్తి జీవనం హిందోళంలో విపులమైన సమాచారం ఇచ్చారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 29: “నాన్న అంటే ఆకాశమంత” అని ధర్మరాజుతో అనిపిస్తాడు.. మహాభారతంలో మహాకవి ఎర్రన. మరో మహాకవి పింగళి సూరన తన తండ్రి మంచితనాన్ని కీర్తిస్తూ కమ్మని పద్యాలు రచించాడు.. అలనాటి “ధర్మదాత” చిత్రంలో అక్కినేని “ఓ నాన్నా నీ మనసే వెన్న” అని పాడిన పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. మనసుల్ని కదిలిస్తూనే ఉంటుంది. “నాన్న ఎందుకో వెనుకబడ్డాడు” అని వినిపించిన కవిత ఇటీవల కాలంలో వాట్సాప్ వేదికగా వేలాది మందిని ఆకట్టుకుంటున్నది. తండ్రి భౌతికంగా పోయిన తర్వాత పిల్లలకు అతనొక గొప్ప జ్ఞాపకంగా మిగులుతాడు. ఆ జ్ఞాపకానికి అక్షర రూపాన్ని కల్పిస్తే అది తరతరాల పాటు నిలిచి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఎంతో అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఆ కోవలో చేరిన రచన “జీవన హిందోళం”. ఇది సుప్రసిద్ధ అష్టావధాని, కవి, సీఎం కేసీఆర్కు దుబ్బాకలో తెలుగు పాఠాలు చెప్పిన గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ జీవిత విశేషాల రచన. 144 పుటల చక్కని పుస్తకాన్ని రచించారు తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి. ఇప్పటికీ వందలాది వ్యాసాలు రచించిన బాల శ్రీనివాసమూర్తికి ఉభయ తెలుగు రాష్ర్టాల్లోనూ ఉత్తమ సాహితీవేత్తగా, గొప్పవక్తగా గుర్తింపు ఉంది.
“జీవన హిందోళం” పేరులోనే ప్రత్యేకత
డాక్టర్ బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి జీవిత చరిత్రను ఎంతో ఆసక్తికరంగా వెల్లడించారు. లక్ష్మీనరసింహశర్మ ఇప్పటి సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో అత్యంత సాధారణమైన కుటుంబంలో జన్మించాడు. స్వయం కృషితో ఎదిగాడు. పద్యాలు ఆలపించడం చిన్ననాడే అలవడింది. ఆయన పద్యగానంలోని కమ్మదనాన్ని ప్రపంచ తెలుగు మహాసభల ప్రసంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. లక్ష్మీనరసింహశర్మకు తనదంటూ పెద్దగా ప్రయత్నం లేకుండానే “హిందోళ”రాగం పట్టుబడింది. దాన్ని సూత్రంగా చేసుకొని తనతండ్రి జీవన నేపథ్యాన్ని బాలశ్రీనివాసమూర్తి వివరించారు.
నాన్న జ్ఞాపకాలను ఒకే దగ్గర రాసిపెట్టుకున్న
ప్రతి వ్యక్తీ తన తండ్రి జ్ఞాపకాలను ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. ఇలాంటి జ్ఞాపకాలు భవిష్యత్తులో మన చరిత్రను రచించేందుకు ఆధారాలు అవుతాయి. ఈ దృష్టితోనే తాను తండ్రి జ్ఞాపకాలతో జీవనహిందోళం రచించాను. అది ఎంతో మంది పాఠకులను ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది.
ఐదు కావ్యాల పరిచయం
సాధారణంగా అవధానులు కావ్యరచన చేయడం అరుదు. అయితే లక్ష్మీనరసింహశర్మ మాత్రం కవితాకళ్యాణి, అవధాన సరస్వతి, అధ్యమాతృక, వాణీశ్వరస్తుతి, పద్యోద్యానము అనే ఐదు వ్యాక్యాలు రచించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ రచనల వెనుక పద్యాన్ని కావ్యాల ప్రత్యేకతల్ని బాలశ్రీనివాసమూర్తి ఆసక్తికరంగా వివరించారు. జ్ఞాపకాలకు నిర్ధిష్టమైన స్థితి ఉండదు. కొన్ని జ్ఞాపకాలు యాది నుంచి త్వరలోనే దూరమవుతాయి. జ్ఞాపకాలనో ఒక ప్రియమైన రీతిలో తీసుకొని రావడం అనుకున్నంత సులువుకాదు. ఈ పనిని బాలశ్రీనివాసమూర్తి విజయవంతంగా పూర్తి చేశారు. “జీవనహిందోళం” అంతా అద్భుతమైన జ్ఞాపకాల మాలిక. ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ నందిని సిధారెడ్డి ప్రశంసించినట్లు జీవన హిందోళం ఆసాంతం చదివిస్తుంది. పాఠకుల్ని ప్రతిపుటా గొప్పగా ఆకట్టుకుంటున్నది.