భీమ్గల్, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని నింబాచల క్షేత్రంపై గురువారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం నంబి వంశస్తులు, వేద పండితులు నంబి పార్థసారథి, విజయ్సారథి, వాసుదేవాచార్యులు, వేణు, విష్ణువర్ధన్, లింబాద్రి, మహేశ్ ఆధ్వర్యంలో కొనసాగింది. అంతకుముందు వేద మంత్రాల మధ్య స్వామి వారి రథ ప్రతిష్ట, రథం ముందర గరుత్మంతున్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. హనుమంతుడు, అభిమాన దేవతలను ఆహ్వానించి రథహోమం జరిపారు. అనంతరం హోమం, పూర్ణాహుతి,అగ్నిహోత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని అందంగా అలంకరించి రథంపై దేవతా చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. గోవింద నామస్మరణ మధ్య మంగళహారతులు, డప్పు చప్పుళ్ల మధ్య రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు.
అందరూ బాగుండాలని కోరుకున్నా: మంత్రి వేముల
రథోత్సవానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా మంత్రి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దయతో లింబాద్రి గుట్ట రోడ్డును నాలుగులైన్లు,సెంట్రల్ లైటింగ్, గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు కన్నె ప్రేమలత, లింగయ్య, లత, నర్సయ్య, గంగాధర్, భూదేవి, సతీశ్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.