బీర్కూర్, అక్టోబర్ 17 : యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలను వేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనగ, వేరు శనగ, పొద్దు తిరుగుడు పువ్వు, సోయాబీన్ తదితర పంటలతో పాటు ఆయిల్‌పామ్ వేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నుంచి మూడేండ్ల వరకు పంట రా దని, దీంతో అంతర పంటలను వేసుకోవచ్చన్నారు. మూడేండ్ల నుంచి 35 ఏండ్ల వరకు పంట వేసుకోవచ్చని చెప్పారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని 10వ వార్డు సాయికృపనగర్ కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. పది లక్షల చొప్పున నిర్మించనున్న మున్నూరు కాపు కమ్యూనిటీ హాలు, పద్మశాలీ సంఘ భవనం, రజక సంఘ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని చెప్పి రైతు పక్షపాతిగా నిలిచారని అన్నారు. గ్రేడ్ ‘ఏ’ రూ. 1960, గ్రేడ్ ‘బీ’ రూ.1940 ధర ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 15 రోజుల నుంచే వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. మిర్యాలగూడ, సూర్యపేట నుంచి దళారులు వచ్చి క్వింటాలుకు కేవలం రూ. 1600 నుంచి ప్రారంభించి ప్రస్తుతం రూ. 1400కు ధరను తగ్గించా రన్నారు. ఇప్పటికే వర్ని, బీర్కూర్ మండలాల నుంచి 500 లారీల వరిధాన్యం వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. వారంరోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం
కరోనా కష్టకాలంలోనూ ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆపలేదన్నారు. ఇది సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంత నాయకులమంతా సవతి తల్లి పిల్లల మాదిరిగానే ఉండేవాళ్లమన్నారు. తమకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల కావాలంటే తనకు రెండేండ్లు పట్టిందని, స్వరాష్ట్రంలో నర్సింగ్ కళాశాల కోసం సీఎం కేసీఆర్‌ను మూడే సార్లు అడిగానని కేవలం 20 రోజుల్లోనే అది వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ దుద్దాల అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, వ్యాయామశాల అధ్యక్షుడు గురువినయ్ కుమార్, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, మండల నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎజాజ్, అలీమొద్దీన్ బాబా, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, షాదీఖానా చైర్మన్ వాహబ్, స్థానిక కౌన్సిలర్లు రమాదేవి, పాశం రవీందర్‌రెడ్డి, నంద కిషోర్, హకీమ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.