నిజామాబాద్ రూరల్/ఖలీల్‌వాడి, అక్టోబర్ 14 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంతోపాటు నిజామాబాద్ రూరల్ మండలంలో గురువారం పర్యటించిన ఎమ్మెల్సీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలం పాల్దలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. గ్రామ పెద్దలు ఎమ్మెల్సీతోపాటు జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావును ఘనంగా సన్మానించారు. ఆలయానికి ఆనుకొని ప్రవహించే వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన చెక్డ్యామును ఆమె పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెక్‌డ్యాం నిర్మాణంతో 3 వేల మీటర్ల దూరంవరకు వలయాకారంలో నీరు నిల్వ ఉండడంతోపాటు భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని సర్పంచ్ అశోక్ ఎమ్మెల్సీకి తెలిపారు. చెక్‌డ్యాం అలుగు వద్ద కవితతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఫొటోలు దిగారు. అనంతరం చెక్ డ్యాం పక్కనే ఉన్న పల్లెప్రకృతి వనాన్ని కవిత పరిశీలించి కాసేపు సేదతీరారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూ.లక్ష విరాళం అందించగా, ప్రకృతివనంలో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశామని సర్పంచ్ ఎమ్మెల్సీకి వివరించారు. చెక్డ్యాముకు ఆనుకొని పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడం బాగుందని, పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తున్నదని కవిత అభినందించారు.
వంతెన నిర్మించాలని వినతి
పాల్ద్ద వాగు అవతలి వైపున వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. వంతెన లేకపోవడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని సమస్యను వివరించారు. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను సంప్రదించి వాగుపై వంతెన నిర్మాణంకోసం నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.
ఎమ్మెల్సీ వెంట జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమలత, ఎంపీపీ అనూషాప్రేమ్దాస్, నాయకులు మధుకర్‌రావు, ముస్కె సంతోష్, అంకల గంగాధర్, బొల్లెంక గంగారెడ్డి, దేవన్న, సర్పంచులు సుప్రియానవీన్, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఆమని, నరేశ్, సుధీర్, విండో చైర్మన్లు మాధవ్‌రెడ్డి, దాసరి శ్రీధర్, పవన్, గులాబ్‌సింగ్, రాజేందర్ తదితరులు ఉన్నారు.
నగరంలోని దేవీమాత మండపంలో..
నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్‌కాలనీలో ఏర్పాటుచేసిన దేవీమాత మండపంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన చేసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.