నారాయణపేట, ఆగస్టు15: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ, జలసిరుల తెలంగాణ దిశగా మనం అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, జెడ్పీ చైర్పర్సన్ వనజగౌడ్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌శాఖ, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 96,834 మంది రైతులు రైతుబీమా అర్హులుగా ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో రైతుబంధు నుంచి 1,54,337 మంది రైతుల ఖాతాల్లో రూ.222.29 కోట్లు జమైనట్లు చెప్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతివనం, ప్రతి మండలానికి ఒక మెగా బృహత్ ప్రకృతి వనం నిర్మిస్తున్నదన్నారు. 72,449 మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో 1,802 మంది వలస కార్మికులకు జాబ్ కార్డులు మంజూరు చేశామన్నారు. 2,10,409 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 82,889 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. జిల్లా దవాఖానలో కొత్తగా 10 పడకల సూపర్ స్పెషాలిటీ ఐసీయూ వార్డు ఏర్పాటు చేశామన్నారు. 10 పడకల పీడీయాట్రిక్ ఐసీయూ, రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 72.11 కి.మీ. రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి 1000 ఎకరాల భూమిని గుర్తించినట్లు, నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానం టీ ప్రైడ్ మరియు టీఎస్పీ పథకం ద్వారా 185 మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందారన్నారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా జిల్లాలో 788 మంది కార్మికులు లబ్ధిపొందారని, పొదుపుఖాతా ద్వారా రూ.284.48 లక్షలు వారి ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. దళితబంధు విజయవంతం కావాలంటే ప్రణాళిక, అమలు ప్రక్రియలో సమాజం యొక్క భాగస్వామ్యం తప్పని సరి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, అదనపు ఎస్పీ భరత్ పాల్గొన్నారు.