చేయడంలో ముందున్న సూర్యాపేట మున్సిపాలిటీ తాజాగా బయోగ్యాస్ తయారీకి సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషితో రాష్ట్రంలోనే మున్సిపాలిటీల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కావడం ప్రథమం. రూ.14 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండగా వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు.
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 13 : పరిశుభ్రమైన పట్టణంగా జాతీయస్థాయిలో పేరు సంపాదించిన సూర్యాపేట మున్సిపాల్టీ .. రాష్ట్రంలోనే ప్రథమంగా తడి చెత్త నుంచి గ్యాస్ తయారు చేసేందుకు సిద్ధమవుతున్నది. పట్టణ ప్రజల నుంచి తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపాలిటీ సఫలమైంది. తడి చెత్త ద్వారా వర్మీకంపోస్టు తయారు చేయడంతో పాటు పొడి చెత్త ద్వారా ప్లాస్టిక్ టైల్స్, ఇటుకలు తయారు చేస్తూ మున్సిపాల్టీ ఆదాయాన్ని పొందుతున్నది. ప్రస్తుతం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోనున్నది.
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సూర్యాపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో వేస్ట్ నుంచి గ్యాస్, పవర్ తయారు చేసే ప్లాంట్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అందులో భాగంగా సూర్యాపేటలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థ వైస్ చైర్మన్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, కన్సల్టెంట్ కిరణ్ బుధవారం సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామాంజులరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా 4.8 మెగావాట్ల పవర్, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నది. సూర్యాపేటలోని ఇమాంపేట వద్ద డంపింగ్‌యార్డు కోసం కేటాయించిన పది ఎకరాల్లో రెండు ఎకరాలను సంస్థ 25 సంవత్సరాల పాటు లీజుకు తీసుకొని అందులో రూ.14 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. జిల్లా కేంద్రంలో రోజూ ఉత్పత్తి అయ్యే 30 టన్నుల చెత్త నుంచి 900 కిలోల గ్యాస్‌ను తయారు చేయనున్నది. ఈ గ్యాస్‌ను ఐఓసీ వారికి అందిస్తారు.
గ్యాస్ తయారీకి అందించే టన్ను చెత్తకు రూ. 150 చొప్పున మున్సిపాలిటీకి చెల్లించనున్నారు. తడి చెత్తతో గ్యాస్‌తో పాటు కంపోస్టు ఎరువు కూడా తయారవుతుందని, ఈ ఎరువును పంట పొలాలకు వాడుకునే అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దాంతో మున్సిపాలిటీకి మరింత ఆదాయం రానున్నది. మరో పది రోజుల్లో ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని సంస్థ అధికారులు వెల్లడించారు.
సూర్యాపేట పట్టణంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ముందుకు రావడం శుభ పరిణామం. సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. చెత్త ద్వారా గ్యాస్ తయారు చేయడంతో పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వీలవుతుంది. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించి సహకరించాలి.
-పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట
తడిచెత్తను తిరిగి ఉపయోగించుకునేందుకే రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. మున్సిపాల్టీలోని డంపింగ్‌యార్డులోని రెండు ఎకరాలను ప్లాంట్ ఏర్పాటు కోసం సంస్థకు 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చాము. సంస్థ మున్సిపాలిటీకి టన్ను చెత్తకు రూ. 150 చొప్పున చెల్లించనున్నది.
-పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట