
మారుమూల పల్లె బాట నుంచి మహా నగరానికి చేర్చే హైవే వరకూ ఎటుచూసినా చెట్లే.
దారి పొడవునా ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్లాదం పంచుతున్నాయి. ఎండకు నీడై, వానకు గొడుగై వాహనదారులను అక్కున చేరుకుంటున్నాయి. దూర ప్రయాణం చేసే పొరుగు రాష్ర్టాల ప్రజలు ఆగి, భోజనాలు చేసి వెళ్తున్నంత హాయిని అందిస్తున్నాయి. ఇది ఏడేండ్ల యజ్ఞం. అభినవ అశోకుడై ముఖ్యమంత్రి కేసీఆర్ రచిస్తున్న వృక్ష‘వే’దం. సర్కారు సంకల్పంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకూ 15.75 కోట్ల మొక్కలు భూమిలో నాటుకున్నాయి. అందులో 4.20 కోట్ల మొక్కలు రహదారుల వెంటే ఉండడం గమనార్హం. మొత్తంగా జాతీయ, రాష్ట్ర, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారులు 15,091 కిలో మీటర్ల మేర ఉండగా, సగటున కిలో మీటరుకు 400 మొక్కల చొప్పున ఏటా 60 లక్షల మొక్కలు నాటడం విశేషం. తొలి విడుతల్లో నాటిన మొక్కలు వృక్షాలై లక్ష్యం నెరవేరుస్తుండగా, ఏటా కొత్త మొక్కలు సైతం వచ్చి చేరి పచ్చదనం పంచుతున్నాయి.
నల్లగొండ, అక్టోబర్ 5 : మొక్కలు ఆక్సిజన్‌తోపాటు వర్షాలకు ఊతమిస్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణకు హరిత హారం పథకం’ కింద సమృద్ధిగా నిధులు కేటాయించి మొక్కల నాటింపు చేపట్టారు. ఏడు విడుతల్లో జాతీయ, రాష్ట్ర, ఆర్అండ్బీ రహదారులతో పాటు పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల రహదారులు 15,091కిలో మీటర్ల నిడివిలో ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు 678 కి.మీ., ఆర్ అండ్ బీ పరిధిలో 3,640 కి.మీ., పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలో 10,773 కిలో మీటర్ల పరిధి కలిగి ఉన్నాయి. ఆయా రహదారుల పరిధిలో ఏటా 60లక్షల చొప్పున ఏడు విడుతల్లో 4.20కోట్ల మొక్కలు నాటారు.
ప్రతి రహదారి వెంట మొక్కలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారుల వెంట మొక్కలు నాటిస్తున్నాం. చనిపోయిన వాటి స్థానంలో మళ్లీ కొత్తవి పెడుతున్నాం. గతేడాది నుంచి మల్టీ లేయర్ పద్ధతిలో మొక్కలు నాటుతున్నాం. ఈ ఏడాది మల్టీ లేయర్ పద్ధతిలో 261కిలోమీటర్ల పరిధిలో కిలోమీటరుకు 400 మొక్కల చొప్పున నాటించాం.
ఏడు విడుతలు.. 15.75 కోట్ల మొక్కలు..
అటవీ శాతం పెంపు ప్రధాన ఉద్దేశంతో 2015లో ప్రారంభమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఇప్పటి వరకు ఆరు దఫాలు పూర్తయ్యింది. ఏటా ఉమ్మడి జిల్లాలో 2.25 కోట్ల చొప్పున ఇప్పటికి 15.75 కోట్ల మొక్కలు నాటారు. అందులో 15 091 కి.మీ. నిడివిలో రహదారుల వెంట 4.20 కోట్ల మొక్కలు, మిగిలిన 11.55 కోట్ల మొక్కలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి పార్కుల్లో నాటారు. అంతేకాకుండా వన నర్సరీల్లో పెంచిన మొక్కలను బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల్లో నాటించారు. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల్లో నాటించి పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున అందించారు.
రెండు, మూడు వరుసలుగా..
రహదారుల వెంట స్థలానికి అనుగుణంగా రెండు లేదా మూడు వరుస(మల్టీ లేయర్)ల్లో మొక్కలు నాటించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంట మల్టీ లేయర్ పద్ధతిలో కిలో మీటరుకు 400 చొప్పున మొక్కలు నాటారు. అదే విధంగా ప్రగతిలో ఉన్నటువంటి 365, 365బి, 565 రహదారితో పాటు 167 జాతీయ రహదారులు మొత్తంగా 678 కి.మీ. నిడివిలో ఉండగా… రోడ్ల నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో మొక్కలు నాటించారు. ఈ రహదారుల్లో జిల్లాకు 250 కి.మీ.ల పరిధిలో కిలో మీటర్‌కు 400 చొప్పున 150సెంటీ మీటర్లకు పైగా ఎత్తున్న మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లాలో 261 కి.మీ., సూర్యాపేట 232కి.మీ, యాదాద్రిలో 185 కి.మీ. పరిధిలో మొక్కలు నాటించారు.