నీలగిరి, మే 12 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగించాలని కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి సిబ్బందిని ఆదేశించారు. వార్డు వాచ్లో భాగంగా గురువారం పట్టణంలోని 26వ వార్డు పరిధిలోని అక్కచెల్మ, రెహమన్ బాగ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రానున్నది వర్షాకాలం కావడం వల్ల శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయి ప్రమాదం ఉందన్నారు.
ముందుస్తుగా గుర్తించి తొలగించడం వల్ల ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక సిబ్బందికి సూచించారు. అనంతరం చర్లపల్లి అర్బన్ పార్కు, మర్రిగూడ జంక్షన్, హైదరాబాద్ రోడ్డులోని వివేకానంద విగ్రహం వద్ద జరిగే అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ ఆసీయా సుల్తానా, ఏసీపీ నాగిరెడ్డి, టీపీఓ శివ అధికారులు నర్సింహారెడ్డి, వెంకన్న, రవీందర్, కొమ్ము ప్రసాద్, ముర్తుజా, జహిరున్నీసా, జిలానీ, జావీద్ పాల్గొన్నారు.
నీలగిరి : నల్లగొండ పట్టణంలో ప్రధాన మంత్రి స్వానిధి పథకం(ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్)లో రుణాలు పొందిన చిరువ్యాపారుల కుటుంబాల సామాజిక, ఆర్థ్ధిక పరిస్థ్ధితులపై సర్వే నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి ఆదేశించారు. గురువారం పట్టణంలోని కౌన్సిల్ హాల్లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
నల్లగొండ పట్టణంలో సుమారు 5,095 మంది వీధివ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందించడం జరిగిందన్నారు. వీటిని పొందిన లబ్ధ్దిదారుల కుటుంబ స్థితిగతులపై సర్వే నిర్వహించి ఆ రిపోర్టులకు సమృద్ధి యాప్ ద్వారా అన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో టీఎంసీ సీహెచ్ శ్రీనివాస్, డీఎంసీ శివాజీ నాయక్, సీఓలు నిమ్మల అనిల్ కుమార్, గుండా జ్యోతి, ఈసారపు నర్సింహ, కొండూరి రాజ, ఆర్పీలు పాల్గొన్నారు.