సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనల అమలుకు తెలంగాణ రాష్ట్రం పునాదిగా మారిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. సమాజ నిర్మాణానికి అడ్డుగోడలుగా నిలిచిన కుల వ్యవస్థను నిర్మూలించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నివాళు
లర్పించారు. సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నది.. ఆ మహానీయుడి ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యతో మాత్రమే వికాసం సాధ్యమని నమ్మిన అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
గురువారం బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సూర్యాపేటలోని ఆయన విగ్రహాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంత్యుత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజ నిర్మాణానికి అడ్డుగోడలుగా నిలిచిన కుల వివక్షను నిర్మూలించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ముందు చూపు వల్లే రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం గొప్పతనం అని అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దళిత సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్టులు, మద్యం షాప్ టెండర్లలో రిజర్వేషన్లు ప్రకటించి దళిత బంధువుగా నిలిచారని అన్నారు. అంతకు ముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందించారు. ఆదర్శ వివాహాలు చేసుకున్న 9మంది దంపతులకు రూ.2.50లక్షల చొప్పున చెక్కులను అందించారు.
జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్, మార్కెట్ చైర్పర్సన్లు పెరుమాళ్ల అన్నపూర్ణ, ఉప్పల లలితాదేవీ ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, రైతు బంధు సమితి రాష్ట్ర డైరెక్టర్ గుడిపూడి వెంకటేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షంతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, దళిత, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా పాలన కొనసాగిస్తున్నారని మంత్రి కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకాలన్నీ దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యావకాశాలు అందించేందుకు కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలను తీర్చిదిద్దారని తెలిపారు. ఆర్థికంగా బలోపేతమయ్యేలా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, లబ్ధిదారుల కళ్లలో ఆనందం ఓ ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో సంతృప్తినిస్తున్నదని పేర్కొన్నారు.
దళితులు, గిరిజనులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట రూ.20లక్షల స్కాలర్షిప్ అందిస్తున్నారని తెలిపారు. స్వయం ఉపాధి శిక్షణ, పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఇంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద రూ.50లక్షల సబ్సిడీ ఇస్తూ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శిక్షణ ఇప్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని చెప్పారు.