సహజ వనరులకు పేరొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖనిజాల వెలికితీత గనుల శాఖకు కాసులు కురిపిస్తున్నది. గ్రానైట్, ఇసుక క్వారీల నిర్వహణతో ఏటా నిధుల రాబడి పెరుగడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఊహించని రీతిలో రూ.78.40కోట్ల ఆదాయం గనుల శాఖకు వచ్చింది. మరోవైపు ఖనిజాల అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అలా ఈ ఏడాదిలో 353 కేసులను నమోదు చేయగా, జరిమానా రూపంలో రూ.1.01కోట్లు వచ్చాయి. అవి గ్రామాల అభివృద్ధ్దికి ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, రహదారుల నిర్మాణానికి దోహదపడుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 92 క్వారీ లీజులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ప్రస్తుతానికి 61 కంకర మిల్లులు, 9 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ మిల్లులు, ఒక క్వార్ట్ యూనిట్ పని చేస్తున్నాయి. గాజు అలంకరణ పరిశ్రమల్లో వినియోగించే అమెథిస్ట్ క్వార్ట్ పరిశ్రమలు బీబీనగర్ మండలంలో, బ్లాక్, కలర్ గ్రానైట్ పరిశ్రమలు మోటకొండూరు, భూదాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, బొమ్మలరామారం, చౌటుప్పల్, తుర్కపల్లి, గుండాల మండలాల్లో కొనసాగుతున్నాయి.
కంకర, రాయి పరిశ్రమలు పోచంపల్లి, తుర్కపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు మండలాల్లో ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో రూ.42.49కోట్ల ఆదాయం లీజు రూపేణా సమకూరగా ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో రూ.78.40కోట్ల ఆదాయం వచ్చింది. బస్వాపురం రిజర్వాయర్‌కు పెద్ద ఎత్తున కంకర, ఇసుకను తరలించడం వల్ల కూడా భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఖనిజాల అక్రమ రవాణాపై కొరడా ఝులిపించడం వల్ల కూడా ఆదాయం వస్తున్నది. ఈ ఏడాదిలో 353 కేసులు నమోదు చేయగా జరిమానా రూపంలో రూ.1.01కోట్ల ఆదాయం వచ్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గనుల శాఖకు సమకూరుతున్న ఆదాయం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్నాయి. కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లించే సీనరేజ్ చార్జీలపై వచ్చిన ఆదాయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఖనిజ సంక్షేమ నిధికి జమ అవుతాయి. ఇందులో 30 శాతం నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకు, 70 శాతం నిధులను పరోక్ష ప్రభావిత ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. సామాజికాభివృద్ధి కార్యక్రమాలతోపాటు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వీటిని వెచ్చిస్తున్నారు. ఇప్పటివరకు 332 ప్రాజెక్టులకు రూ.19.11కోట్లు కేటాయించగా, రూ.11.90కోట్ల వ్యయం గల 231 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా రూ.7.21కోట్ల వ్యయం గల 101 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.
జిల్లాలో పనిచేస్తున్న క్వారీలపై నిరంతర నిఘా ఉంచుతున్నాం. అక్రమ మైనింగ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎప్పుడూ రాని రీతిలో ఈ ఏడాది అత్యధిక ఆదాయం గనుల శాఖకు సమకూరింది. సీనరేజ్ నిధులు, డీఎంఎఫ్టీ నిధులను జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నాం.
– ఎ.వెంకటరమణ, యాదాద్రి భువనగిరి జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి
నెల 2021(రూ.లక్షల్లో)2022(రూ.లక్షల్లో)
ఏప్రిల్ 33.348 328.32
మే 114.71 277.5
జూన్ 116.54 282.62
జూలై 259.77 308.07
ఆగస్టు 650.63 320.28
సెప్టెంబర్ 193.99 275.12
అక్టోబర్ 662.16 307.1
నవంబర్ 164.13 3,944.63
డిసెంబర్ 180.00 245.62
జనవరి 218.11 326.1
ఫిబ్రవరి 1,134.36 629.78
మార్చి 521.41 294.86