సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటే బీడు భూములు.. ఫ్లోరైడ్ కోరల్లో చిక్కిన పల్లెలు. సాగు సంగతి అటుంచితే, తాగునీటికీ తండ్లాటే. ప్రతి సీజన్లోనూ ఎరువులు, విత్తనాల కోసం లాఠీదెబ్బలు. విద్య, వైద్య రంగాల్లో వెనుకబాటు. నిధుల్లేక నీరసించిన స్థానిక సంస్థలు, కరెంటు బుగ్గలకు సైతం పైసలెల్లని పంచాయతీలు. జిల్లా కేంద్రానికి రావాలన్నా గతుకుల రోడ్లపై నరకయాతనే. ఇలా ఏ రంగం చూసినా తీవ్ర నిర్లక్ష్యం. రాజధానికి ఆనుకునే ఉన్నా అభివృద్ధి అథఃపాతాళంలో ఉండేది.
అందుకే.. మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మాకే దక్కాలంటూ సాగిన తెలంగాణ ఉద్యమంలో
నల్లగొండ జిల్లా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఊరూవాడ ఉప్పెనై కదిలింది. ఆనాటి ఆశలకు, ఆకాంక్షలకు ఆచరణ రూపమిచ్చిన సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. సంక్షేమం వెల్లివిరుస్తున్నది. ఉద్యమ నేతగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కష్టాలను కళ్లారా చూసి రణం చేసిన కేసీఆర్ ఈ ఎనిమిదేండ్లలో అనేక అసాధ్యాలను ఆవిష్కరించి తిరుగులేని పాలనను అందించారని సబ్బండ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సాగు, తాగు నీరు, విద్యుత్ సరఫరా, వ్యవసాయాభివృద్ది, విద్య, వైద్యం, పరిపాలన వికేంద్రీకరణ, రవాణా వ్యవస్థ ఇలా అన్ని రంగాల్లో సమూలమైన మార్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందని ఘంటాపథంగా చెప్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని సాధించాక, రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు. అందుకే కేసీఆర్ పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధిలో కీలకమైన సాగు, తాగునీరు, కరెంటు సరఫరా, వ్యవసాయాభివృద్ధి, విద్య, వైద్యం, పరిపాలన వికేంద్రీకరణ, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. వీటికి తోడు ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి. పేదల జీవితాలకు ఆసరాగా ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాధాన్యత ప్రకారం ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
గతంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు మినహా మిగతా ప్రాంతాల్లో బీడుభూములే దర్శనమిచ్చేవి. దాంతో ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులను అనుసంధానం చేసింది. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో దశాబ్దాల కలగా మారిన ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తరలించింది. సాగర్ ఆయకట్టులోనూ టెయిలెండ్ భూములకు సాగునీరందించడంపై దృష్టి సారించింది. రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. ఎస్ఎల్బీసీ వరద కాల్వను పూర్తి చేసి 80వేల ఎకరాలకు నీరందిస్తున్నది. సాగునీటి వసతి లేని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల కోసం డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది.
నల్లగొండ జిల్లా అనతికాలంలోనే ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడం చారిత్రక మార్పుగా చెప్పుకోవచ్చు.
దామరచర్ల మండల పరిధిలో 4,400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ జిల్లా అభివృద్ధికే తలమానికంగా మారనుంది. మరో ఏడాదిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వేర్వేరుగా మెడికల్ కాలేజీలతో పాటు యాదాద్రికి ఎయిమ్స్ మంజూరైంది. యాదాద్రి జిల్లాకు సైతం ప్రత్యేకంగా మెడికల్ కాలేజీని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆస్పత్రుల్లో వైద్యసేవల్లో ఎన్నో మార్పులు జరిగాయి. నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
పేదల కోసం గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు పెద్దసంఖ్యలో నెలకొల్పారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 105 విద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిలో పాటు ఇంటర్, డిగ్రీ వరకు గురుకులాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మైనార్టీ గురుకులాల సంఖ్య భారీగా పెంచారు.
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. కొత్తగా జోనల్ వ్యవస్థను తీసుకువచ్చి దాని ప్రకారంగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఇప్పటికే పోలీసు, గ్రూప్ 1, ఎక్సైజ్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. త్వరలోనే మిగతా నోటిఫికేషన్లపైనా కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో యువతకు అండగా నిలిచేందుకు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. యువతకు భరోసానివ్వడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి పథకాలన్నీ సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులకు ఊహకు కూడా అందలేదు. గోదావరి జలాలు, ఇంటింటికీ నల్లా, మెడికల్ కాలేజీలు, గురుకులాల ఏర్పాటు ఇలా ఎన్నో పథకాలు అసాధ్యమన్న భావన ప్రజల్లో నూరి పోశారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికబద్ధంగా, చిత్తశుద్ధితో లక్ష్యం మేరకు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథంలో సరికొత్త శకానికి శ్రీకారం చుట్టారు.
అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ముందుగా ఆసరా పింఛన్లు భారీగా పెంచారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. వృత్తిదారుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. మత్య్సకారులు, యాదవులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, గీత, చేనేత కార్మికులకు పలు పథకాలు ప్రకటించి చేయూత అందిస్తున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకం అందించే దిశగా సీఎం కేసీఆర్ సారథ్యంలో నిరంతర కృషి కొనసాగుతున్నది. గతేడాది కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారు. స్వరాష్ట్రంలో స్పష్టమైన మార్పును గమనిస్తూ, ప్రగతి ఫలాలను ఆస్వాదిస్తున్న వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అప్పటి ఉద్యమనేత, నేటి పాలనాధ్యక్షుడు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక బోర్లు, బావులున్న జిల్లాగా నల్లగొండకు పేరుంది. కరెంటు కష్టాలు నిరంతరం వెంటాడేవి. కానీ, స్వరాష్ట్రంలో 24గంటల ఉచిత కరెంటుతో వ్యవసాయం పండుగలా మారింది. సాగుభూమి విస్తీర్ణం 13లక్షల నుంచి 21లక్షలకు పెరిగింది. వరి, పత్తి సాగు, దిగుబడుల్లోనూ ప్రథమ స్థానమే.
పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా విభజించారు. ఇదే సమయంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ప్రతి నెలా కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నారు. ప్రకృతివనం, వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డ్, రైతువేదిక ఇలా ఎన్నో శాశ్వత వనరులను సమకూర్చుతున్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల విశాలమైన రహదారులను నిర్మించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల కష్టాలు కడతేరాయి. టీఆర్ఎస్ పాలనలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆర్హులందరికీ చేరి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం ద్వారా నాకు లబ్ధి కలిగింది. కల్యాణ లక్ష్మి వర్తించడంతో కూతురు వివాహానికి చేసిన అప్పులు తీరాయి. వ్యవసాయ భూమికి ఏటా రైతు బంధు డబ్బులు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి.
– కంచుగట్ల పెదలింగయ్య యాదవ్,తుంగపహాడ్, కాంగ్రెస్ నాయకుడు, మిర్యాలగూడ రూరల్
నిరంతర విద్యుత్ ఉత్పత్తికి రివర్సబుల్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. రివర్స్‌బుల్ విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా నాగార్జునసాగర్ డ్యాంను 1977లో నిర్మించినా 30 ఏండ్లుగా ఆ పద్ధతిని ఉపయోగించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో టర్బైన్లను పునరుద్ధరించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎంతో ప్రయోజనాన్ని అందిస్తున్నది. టెయిల్‌పాండ్ డ్యాం వరకు 7 టీఎంసీల నీటిని నిల్వ చేసి, ఆ నీటిని మళ్లీ నదిలోకి ఎత్తిపోసి పీక్ సీజన్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కరెంటు కష్టాలు తీరుతున్నయి.
– సందీప్‌రెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, నాగార్జునసాగర్
అప్పట్లో ఎవుసం అంటేనే భయపడేది. పంట వేస్తే సాగునీటి కష్టాలు వచ్చేవి. మరోవైపు నీళ్లు ఉంటే కరెంటు సమయానికి ఉండేది కాదు. చాలా సార్లు కరెంటు రాక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. అప్పులు చేసి రైతులు తీవ్ర నష్టపోయేవారు. రాష్ట్రం ఏర్పాటైనంక రైతులకు మంచి రోజులొచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతహాగా రైతు కావడంతో వారి కష్టాలను గుర్తించి సాగునీళ్లు, విద్యుత్ సమస్య, పెట్టుబడి సాయం వంటి గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు. అప్పు కోసం రైతు మరో ఇంటి గడప తొక్కొద్దని భావించి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఏ ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పాటైందో అదే దారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారు. మరో రెండు ధపాలుగా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలి.
– దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, మొరిపిరాళ్ల గ్రామం, ఆత్మకూరు(ఎం)
తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. ఎన్నో పార్టీల సీఎంలు పరిపాలించినా సంక్షేమ పథకాలు అందరికీ అందేవి కావు. కానీ, నేడు పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కుటుంబంలో రెండు, మూడు పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది. నాకు గీత కార్మికుల పింఛన్ అందుతున్నది. అలాగే రైతు బంధు, రైతు బీమా పథకాలకు అర్హత ఉంది. నీరా ప్రాసెస్ కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం.
– బండి రామచంద్రయ్య, గీత కార్మికుడు, బొమ్మలరామారం
15 సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు. అప్పట్లో నాకు సంవత్సరం వయస్సున్న కూతురు ఉంది. మా తల్లిగారి ఇంట్లోనే ఉంటూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నా బిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష 16 వేల రూపాయల నగదు అందించడంతో అప్పు లేకుండా పెండ్లి అయిపోయింది. నా లాంటి వాళ్ల కష్టాలు తెలుసుకుని గొప్ప గొప్ప పథకాలు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– బత్తుల సత్యవతి, పైలాన్‌కాలనీ
నాకు ఏడుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు అయినయి. ఇద్దరికి కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు వచ్చినయి. గతంలో మా ఊళ్లో నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు వచ్చేవి. తెలంగాణ రాక ముందు సాగర్ నీళ్ల కోసం ఊరి మధ్యన ఉన్న ట్యాంక్ దగ్గరి పోతే మస్తు జనాలు ఉండేవాళ్లు. నీళ్ల కోసం గంటల తరబడి నిలబడేది. అయినా చివరికి నీళ్లు దొరక్క ఖాళీ బిందెలతోని ఇంటికి పోయేది. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని ఇంట్లోకే నీళ్లు వస్తున్నయి. పేదోళ్లకు ఎన్నో రకాలు సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– దామెర నాగమ్మ, దామెర, నాంపల్లి
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పెరిగినయి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నయి. ప్రధానంగా రైతుల అభ్యున్నతి కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ పథకాలు మంజూరు చేస్తున్నది. నాకున్న నాలుగు ఎకరాలకు కారుకు 20 వేల రూపాయల చొప్పున ఏడాదికి 40 వేలు పెట్టుబడి సాయం అందుతున్నది. మా అమ్మకు ఆసరా పింఛన్ వస్తున్నది.
– ఉప్పునూతల వెంకన్న యాదవ్, సర్పంచ్, జీ.చెన్నారం, నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించింది. నాకు ఐదెకరాలకు రైతు బంధు పథకం కింద రెండు పంటలకు రూ.50వేలు వస్తున్నయి. మిషన్ భగీరథ పథకంతో ఇప్పటికే ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నయి. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని సంక్షేమ పథకాలు టీఆర్ఎస్తోనే సాధ్యమయ్యాయి.
– కేతావత్ దేవానాయక్, రైతు, తెల్దేవర్పల్లి, చందంపేట
కేసీఆర్ సారు నెలనెలా ఇస్తున్న ఆసరా పింఛన్ నాకు ఎంతో భరోసా ఇస్తున్నది. కేసీఆర్ ఇచ్చే డబ్బులతోనే ఇంటి కిరాయి కడుతున్నా. రేషన్ బియ్యం, కిరాణా సామాను కొనుక్కుంటున్నా. ఆ డబ్బులతోనే మందులు కూడా తెచ్చుకుంటున్నా. కేసీఆర్ ఇస్తున్న పింఛన్ డబ్బులతోనే నాజీవితం గడుస్తుంది. నాలాంటి పండు ముసలోళ్లకు పెద్ద కొడుకుగా నిలబడ్డడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌సార్ సల్లగుండాలి.
– ఆవుల నర్సమ్మ, రామన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సాగర్ రిజర్వాయర్‌లో చేపపిల్లలను వదలడంతో మాకు చేపలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. తెలంగాణ రాక ముందు చేపలు పడక మా కుటుంబ పోషణకు కూలి పనులకు వసల వెళ్లేది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. మత్స్యకారుల అభివృద్ధికి వలలు, రుణాలు, అందించడంతో పాటు, చేపల పెంపకానికి 5 కేజీ కల్చర్ యూనిట్లను, 75 శాతం సబ్సిడీతో మార్కెటింగ్ వాహనాలను మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల జీవితాలు మెరుగుపడ్డాయి, సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కోడ అప్పారావు, మత్స్యకారుడు, పైలాన్‌కాలనీ