సూర్యాపేట, మే 2 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తీరు విచిత్రంగా ఉంది. మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోకపోవడంతో పాటు, లెక్క ప్రకారం ఉన్న ధాన్యం, బియ్యంపై లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ ఎఫ్‌సీఐతో వరుస తనిఖీలు చేపడుతూ చేతులు కాల్చుకుంటున్నది. ఎఫ్‌సీఐకి సరిపడా గోదాములు లేకపోవడంతో పాటు, రైల్వే వ్యాగన్లు రాక మిల్లుల్లోనే ధాన్యం, బియ్యం నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి.
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అండదండగా నిలవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అనుకున్న స్థాయిలో మిల్లులు పెరగకపోవడంతో సామర్థ్యానికి మించి ధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాలన్నీ కేంద్రానికి తెలిసినా సీఎంఆర్ సేకరణలో నిబంధనలు ఏమాత్రం మార్చకుండా కఠినంగా వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ గడువులోపు సీఎంఆర్ పూర్తికి అధికారులు మిల్లర్ల వెంటపడి మరీ మిల్లింగ్ చేయిస్తున్నారు. గత యాసంగిలో 81శాతం సీఎంఆర్ పూర్తవగా మరో నెల గడువిస్తే మిగిలిన 19శాతం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వంతో సేకరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో కేంద్రం పెట్టే ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు.
దేశంలోని ఇతర రాష్ర్టాల మాదిరి తెలంగాణ రైతుల ధాన్యం సేకరించాలని కేంద్రంపై యుద్ధం ప్రకటించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతుల పక్షాన ఉద్యమించిన విషయం విదితమే. జిల్లాలోని రైతుల నుంచి ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించి మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే జిల్లాలో పెరిగిన సాగు మేరకు ఎఫ్‌సీఐ గోదాములు పెంచకపోవడం, గోదాములు, మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని తరలించేందుకు సకాలంలో రైల్వే వ్యాగిన్లు రాకపోవడంతో మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా బియ్యం, ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఇంత జరుగుతున్నా సకాలంలో బియ్యం ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లులపై కేంద్ర పెద్దలు ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో ఎన్ని అవాంతరాలు కల్పించినా, గోదాములు లేకున్నా అధికార యంత్రాంగం మిల్లర్ల వెంట పడి మిల్లింగ్ చేపిస్తూ ఎప్పటికప్పుడు గడువుకు కాస్త అటుఇటుగా టార్గెట్ పూర్తి చేస్తున్నారు. 2020-2021 యాసంగికి సంబంధించి మార్చి వరకు గడువు ఉండగా మరో నెల ఏప్రిల్ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 81శాతం మిల్లింగ్ పూర్తి కాగా మరో 19 శాతం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. యాసంగిలో జిల్లాలో 6.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించగా మిల్లింగ్ అనంతరం 4.52లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది.
దీనికి గాను ఏప్రిల్ చివరి నాటికి 81శాతం అంటే 3.66లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపించారు. మొత్తం 100మిల్లులకు గాను 72మిల్లులు వందశాతం పూర్తవగా 28మిల్లుల నుంచి 19శాతం రావాల్సి ఉంది. ఈ మిల్లుల్లో సైతం ధాన్యం, బియ్యం నిల్వ ఉండగా గడువు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడువు పెంపునకు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా ఎఫ్‌సీఐ అధికారుల బృందం జిల్లాలోని పలు మిల్లులను తనిఖీలు చేస్తున్నది. ఆయా మిల్లుల్లో కిక్కిరిసే రీతిన బియ్యం, ధాన్యం బస్తాలు ఉండడంతో అధికారుల బృందం అనుమానాలు పటాపంచాలయ్యాయి.
మిర్యాలగూడ / నిడమనూరు / కోదాడ రూరల్ / చిట్యాల, మే 2 : మిర్యాలగూడ పట్ణణ పరిసర ప్రాంతాల్లోని రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఎఫ్‌సీఐ అసిస్టెంట్ మేనేజర్ రుషిలాల్, అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మిల్లుల్లో తనిఖీలు చేశారు. గూడూరులోని శివరామకృష్ణ మిల్లులో కస్టం మిల్లింగ్ ధాన్యం నిల్వలు పరిశీలించారు. ఇప్పటి వరకు మిల్లింగ్ చేసిన బియ్యం ఎంత దాని వివరాలు ఎఫ్‌సీఐకి అందించిన బియ్యం ఏసీకేలను పరిశీలించారు.
ఎఫ్‌సీఐకి అందించిన బియ్యం పోను మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలు పరిశీలించారు. మిల్లులను పూర్తిగా పరిశీలించాక ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. తనిఖీల్లో సివిల్ సైప్లె డిప్యూటీ తాసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఆర్ఐ సురేందర్సింగ్, సివిల్ సైప్లె టెక్నికల్ అసిస్టెంట్లు పూల్ సింగ్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నిడమనూరు మండలంలోని రాఘవసాయి, లోకేశ్వరి, హరికృష్ణ, రాజేందర్ రైస్ మిల్లులను ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేశారు. కస్టం మిల్లింగ్ ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వల స్టాకు వివరాలు పరిశీలించారు.
కోదాడ పట్టణ పరిధిలోని కోమరబండలో గల పద్మాలయ, సత్యసాయి, రాఘవేంద్రతో పాటు మరో మిల్లులో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేశారు. కోమరబండ, తమ్మరతో పాటు పట్టణ పరిధిలోని 34మిల్లుల్లో మరో రెండు రోజులు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. చిట్యాల మండలంలోని చిట్యాల, వనిపాకల, వట్టిమర్తిలోని రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మరో నెల గడువు ఇస్తే మిల్లుల్లో ఉన్న ధాన్యం మిల్లింగ్ చేయడం, వారి వద్ద ఇప్పటికే పేరుకుపోయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో గత యాసంగికి సంబంధించిన సీఎంఆర్ 81శాతం పూర్తయ్యింది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి సైతం గడువు చాలా ఉండగా ఇప్పటికే దాదాపు 20శాతం పూర్తయ్యింది. నాతో పాటు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మిల్లులు తనికీలు చేస్తున్నాం. అన్నిచోట్ల ధాన్యం, బియ్యం లెక్క ప్రకారం ఉంది.
– మోహన్‌రావు, అదనపు కలెక్టర్, సూర్యాపేట