కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ పర్యటన మరింత చిచ్చు రాజేస్తున్నది. ఆ టూర్‌ను ఆసరాగా తీసుకుని పార్టీపై పట్టు సాధించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలకు సీనియర్ నేతలు అడుగడుగునా మోకాలడ్డుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు రేవంత్‌రెడ్డి పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శుకవ్రారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా కొట్టారు. మరోవైపు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై కోపంతో ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా పాల్గొనలేదు. ఉమ్మడి జిల్లా మీటింగ్ అని ప్రకటించి జిల్లా కేంద్రంలో కాకుండా మారుమూలన నాగార్జునసాగర్‌లో నిర్వహించడం ఆ పార్టీలో పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులమని చెప్పుకొనే నేతలే రోజుకోరీతిలో వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 6న వరంగల్‌లో జరుగనున్న రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి వెళ్లడం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే కత్తులు దూసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ పర్యటన పేరుతో రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పార్టీ సన్నాహక సమావేశాలకు ప్లాన్ చేసుకున్నాడు.
అయితే ఈ విషయంలో ఆయా జిల్లాల్లోని సీనియర్లను సంప్రదించుకుండానే పర్యటన తేదీలను ప్రకటించారు. ఇదే అంశం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్ పర్యటనను వ్యతిరేకించారు. ‘మా జిల్లాను మేము చూసుకోగలం…. మా జిల్లాకు రావాల్సిన అవసరం లేదు.. ఇక్కడ మేమే ఫహిల్వాన్లం’ అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేరుగానే స్పష్టం చేశారు.
వస్తే అడ్డుకుని తీరుతామని అల్టిమేటం కూడా జారీ చేశారు. దీంతో ఈ నెల 27న తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగాల్సిన పర్యటనను రేవంత్‌రెడ్డి రద్దు చేసుకోక తప్పలేదు. గతంలోనూ సభ్యత్వ నమోదు సమయంలోనూ జిల్లా ఇన్‌చార్జీగా నియామకమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డిని సైతం జిల్లాకు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా వీరద్దరినీ కాదని జిల్లాలో అడుగుపెట్టాలని రేవంత్‌రెడ్డి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ద్వారా ప్రయత్నాలు చేశారు.
గీతారెడ్డితో కలిసి జానారెడ్డి పెద్దమనిషిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడి ఒప్పించారు. అయితే నల్లగొండ, సూర్యాపేట తప్ప వేరే ప్రాంతాల్లో మీటింగ్ పెట్టుకోవాలని వెంకట్‌రెడ్డి పట్టుబట్టినట్లు తెలిసింది. దీనికి ఓకే చెప్పిన జానారెడ్డి ‘ఎక్కడో ఎందుకు… తన నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లోనే రేవంత్‌రెడ్డి మీటింగ్‌కు పెడతా’నని చెప్పి ఈ నెల 29వ తేదీని ఖరారు చేశారు. అయితే దీనికి ఒక రోజు ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అవసరం నల్లగొండ జిల్లాకు లేదంటూ బాహాటంగానే వ్యతిరేకించారు. కానీ జానారెడ్డి ముందుపడి శుక్రవారం సాగర్‌లో మీటింగ్‌ను ఏర్పాటు చేయగా రేవంత్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, గీతారెడ్డి హాజరయ్యారు.
సాగర్‌లో జరిగిన సన్నాహక సమావేశానికి ముందే ప్రకటించిన విధంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు. తన నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన ఉన్న నేపథ్యంలో తాను హాజరుకావడం లేదని పైకి చెప్పినా… జిల్లాలో రేవంత్ పర్యటన కోమటిరెడ్డికి ఎంతమాత్రం ఇష్టంలేదన్నది బహిరంగ రహస్యమే. ఇక ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. శుక్రవారం సాగర్ మీటింగ్‌కు సైతం ఆయన హాజరుకాలేదు. ఇక ఇదే సమయంలో ఎంపీలిద్దరూ వ్యతిరేకిస్తున్న సమయంలో రేవంత్‌రెడ్డిని జిల్లాకు తీసుకువస్తామని ప్రకటించిన అద్దంకి దయాకర్ సైతం మీటింగ్‌కు రాలేదు.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై ఉన్న కోపంతోనే రాలేదని తెలుస్తున్నది. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరుకావడాన్ని దయాకర్ జీర్ణించుకోవడం లేదని సమాచారం. ఇక మరోవైపు సాగర్‌లో మీటింగ్ జరుగుతుండగానే ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి వాదనకు దిగినట్లు తెలిసింది. వద్దనుకున్నాక మీటింగ్‌కు ఎలా వెళ్తావని, మీరు వెళ్లడం అంటే జిల్లాలో రేవంత్ పెత్తనాన్ని ఒప్పుకున్నట్లే కదా?! అన్న రీతిలో ఉత్తమ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. తనకు తప్పించుకునే సాకు దొరకలేదంటూ, తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకాక తప్పలేదని ఉత్తమ్ బదులిచ్చినట్లు తెలిసింది. అయినా సరే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీ ఉత్తమ్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. చివరకు జిల్లాలో రేవంత్ పర్యటన జిల్లాలోని ఇద్దరు ఎంపీల మధ్య కొత్త చిచ్చుకు దారితీసిందన్న చర్చ మొదలైంది.
రేవంత్‌రెడ్డి పర్యటనను వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాకూర్‌కు రేవంత్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉటుందని, కానీ, నల్లగొండ జిల్లాకు రావొద్దంటూ వెంకట్‌రెడ్డి ఎలా ప్రకటిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. వెంకట్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీలో గందరగోళానికి దారితీస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోమటిరెడ్డి చేసిన కామెంట్ల వీడియో, ఆడియో క్లిప్పులను మాణిక్ ఠాకూర్‌కు అందజేసినట్లు సమాచారం.
అయితే శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న మాణిక్ ఠాకూర్ దీనిపై విచారణ చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు తమ నేతకు కొత్తమీ కావంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు కొట్టిపడేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు వరంగల్‌లో రాహుల్ సభ జరిగేలోపు ఎటువైపు దారితీస్తాయోనన్న చర్చ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.