ప్రకటించిన విధంగానే ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 83 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నోటిఫికేషన్ పోలీస్ విభాగం నుంచి జారీ అయ్యింది. వివిధ స్థాయిల్లోని పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నాలుగు నోటిఫికేషన్లను జారీ చేయడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. మొత్తం 414 జోనల్ స్థాయి ఎస్ఐ పోస్టులకుగాను యాదాద్రి జోన్ పరిధిలో సివిల్, ఏఆర్ కలిపి 80 ఉన్నాయి. ఇక జిల్లా క్యాడరైన కానిస్టేబుల్ పోస్టులు ఉమ్మడి జిల్లాలో 902 సివిల్, ఏఆర్ విభాగాల్లో ఉన్నాయి. వాటితోపాటు పోలీస్ విభాగంలోని కేటగిరీల వారీగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నోటిఫికేషన్ల విడుదలతో సంతోషంగా ఉన్న ఉద్యోగార్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టి సారిస్తామని చెప్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖలోని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ విభాగాల వారీగా నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా భర్తీకి సిద్ధ్దమైంది. పోలీసు శాఖలో క్యాడర్ వారీగా ఖాళీలను చూపుతూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉమ్మడి జిల్లాలోని జిల్లా వారీగా, జోన్ వారీగా పోస్టులను స్పష్టంగా చూపింది. జోన్ పరిధిలో వచ్చే ఎస్ఐ పోస్టులు యాదాద్రి జోన్లో మొత్తం సివిల్ 65, ఏఆర్ విభాగంలో 15 పోస్టులను నింపనుంది. ఇక స్టేషన్ ఫైర్ పోస్టులు మరో 3 ఉన్నాయి. మొత్తం 414 ఎస్ఐ పోస్టుల్లో చార్మినార్ జోన్ తర్వాత అత్యధిక పోస్టులు ఉన్నది యాదాద్రి జోన్లోనే కావడం విశేషం. మల్టీ జోన్ పోస్టులైన పోలీసు ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో చార్మినార్ మల్టీ జోన్‌లోని 22 ఎస్ఐ పోస్టులకు, ఫింగర్ ఫ్రింట్ విభాగంలోని ఏఎస్ఐ పోస్టులు ఐదింటికి కూడా ఉమ్మడి జిల్లా అభ్యర్థ్ధులు పోటీ పడవచ్చు.
ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,614 సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 347 సివిల్, 117 ఏఆర్ కానిస్టేబుళ్లు, సూర్యాపేట జిల్లాలో 230 సివిల్, 90 ఏఆర్, యాదాద్రి జిల్లాతో కూడిన రాచకొండ కమిషనరేట్ పరిధిలో 325 సివిల్, 505 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక మల్టీ జోనల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు(టీఎస్ఎస్పీ) విభాగంలో 2,486 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఆదేశాలు ఇచ్చారు.
వీటికి ఉమ్మడి జిల్లా అభ్యర్థులంతా అర్హులే. వీటితో పాటు నల్లగొండలో 23, సూర్యాపేటలో 15, యాదాద్రి జిల్లాలో 27 ఫైర్ మెన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక పోలీసు ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మల్టీ జోనల్ పరిధిలో మొత్తం 216 కానిస్టేబుల్ పోస్టులకు కూడా ఉమ్మడి జిల్లా అభ్యర్థ్ధులు పోటీపడవచ్చు.
మే 2 నుంచి 20 వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పోస్టుల వారీగా అర్హత, ఎంపిక విధానం, వయస్సు ఇలా సమగ్ర అంశాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దాంతో పాటు పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్షా సమయం, ఇతర అన్ని విషయాలపైనా స్పష్టతనిచ్చారు.
అదేవిధంగా మూడేళ్ల వయోపరిమితి సడలింపును స్పష్టంగా పేర్కొన్నారు. కాగా పోస్టులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రత్యేక కోచింగ్ కేంద్రాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధ్దమయ్యే వారికి చేయూతనందించేందుకు ఉమ్మడి జిల్లాలోని పోలీసు శాఖ కూడా ప్రత్యేక ఉచిత శిక్షణను ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల నేపథ్యంలో యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.