బొడ్రాయిబజార్, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శనివారం రైతులు తీసుకొచ్చిన వడ్ల మద్దతు ధరను ఒక్కసారిగా రూ.1200 నుంచి 1500 తగ్గడంతో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి హుటాహుటిన మార్కెట్కు చేరుకొని మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవితో కలిసి మిల్లర్లు, ట్రేడర్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేశారు. నిబంధనల మేరకు రైతులు తెచ్చిన ధాన్యానికి ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని ట్రేడర్లు, మిల్లర్లను హెచ్చరించారు. రైతులు కూడా తేమ, తాలు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. దాంతో రైతుల ఆందోళనతో మార్కెట్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లను ఆదివారం కొనసాగించి రైతులకు మద్దతు ధర చెల్లించి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం 26,732 బస్తాల ధాన్యం రాగా ఆదివారం శ్రీరామనవమి ఉన్నప్పటికీ మార్కెట్ అధికారులు, సిబ్బంది అక్కడే ఉండి ధాన్యాన్ని కాంటాలు వేయించారు. ఆ వెంటనే ఎగుమతికి చర్యలు తీసుకున్నారు. మద్దతు ధర పెరుగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
బొడ్రాయిబజార్ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములవ్వాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి కోరారు. ఆదివారం స్థానిక మార్కెట్ కార్యాలయంలో మిల్లర్లు, ఖరీదుదారులు, మార్కెట్ కమిటీ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మిల్లర్లంతా మార్కెట్లో నిర్వహించే కొనుగోళ్లలో పాల్గొనాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చే ముందు ఆరబెట్టుకొని తీసుకురావాలని, ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలన్నారు. మంగళవారం నుంచి మార్కెట్లో టోకెన్ పద్ధతిని అమలు చేస్తామని తెలిపారు. ఆమె వెంట మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఫసియొద్దీన్, అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, యూడీసీ కాసీం, సూపర్వైజర్ శ్రావణ్ ఉన్నారు.