కోదాడ రూరల్, ఏప్రిల్ 24 : నిషేధిత గుట్కాపై పోలీసుల నిఘా పెరుగడంతో వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో పాత ఇనుము సేకరించే ఆటోలు ఉదయం కోదాడ నుంచి బయల్దేరుతాయి. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో పాత ఇనుము, పాత ప్లాస్టిక్ సామన్లు కొనుగోలు చేస్తూ మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకుంటారు. అప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి దిగుమతి చేసుకున్న గుట్కా ప్యాకెట్ కాటన్లు ఈ ఆటోల్లో వేసి పైన పాత ఇనుము సామాను కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ సర్వీసు రోడ్ల మీదుగా ప్రయాణిస్తూ కోదాడకు గుట్కా ప్యాకెట్లు చేరవేస్తున్నారు. టోల్గేట్ల వద్ద నిఘా ఉన్న వారు పోలీసులకు అనుమానం రాకుండా టోల్ ఫీజులేని గేటు నుంచి సులువుగా ప్రయాణిస్తూ కోదాడకు చేరవేస్తున్నారు. ఇక్కడ నుంచి పలు గ్రామాల వ్యాపారులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో గంటల వ్యవధిలో సరుకు డెలివరీ చేస్తున్నారని సమాచారం.
గతంలో కోదాడలో గుట్కా వ్యాపారం చేసేవారు, కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది. ప్రస్తుత ముఠా గ్రామాల్లో వ్యాపారులకు తాము మాత్రమే అమ్మాలని హుకుం జారీ చేస్తుంది. అలా కాదని వేరే వారు అమ్మినా, చిరు వ్యాపారులు వేరే వారి వద్ద కొన్నా పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తుండడం గమనించ దగ్గ విషయం. అందరికీ అన్ని ఇస్తున్నాం పోలీసులు, మీడియాను తామే మ్యానేజ్ చేస్తాం. ఎలా ంటి భయం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని ఈ ముఠా చెప్పి వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. రూ.2 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను రూ. 10కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
కోదాడలో జరుగుతున్న గుట్కా వ్యాపారంపై పట్టణంలో ఎస్ఐ కఠినంగా వ్యవహరించడంతో పాటు పలుమార్లు దాడులు చేసి సరుకు స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈ ముఠా తమ పలుకుబడితో ఆయనను సివిల్ ఎస్ఐ నుంచి కోదాడ ట్రాఫిక్‌కు బదిలీ చేయించినట్లు సమాచారం. నెల రోజుల క్రితం మళ్లీ ఆయన ట్రాఫిక్ నుంచి టౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఆయన తమకు అడ్డంకి మారతాడని తమకు ఉన్న రాజకీయ పటుకుబడితో సూర్యాపేటకు బదిలీ చేయించినట్లు కోదాడలో పలువురు అనుకుంటున్నారు. తమ వ్యాపారానికి ఎవరు అడ్డు వచ్చినా పచ్చనోట్లతో నోరు మూయించి ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది.