సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 22 : అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిచ్చి పేదలు సైతం ఘనంగా జరుపుకొనేలా కానుకలు అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మదీనా మసీద్ ఆవరణలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. కొద్ది మంది మాత్రమే సంతోషంగా ఉండడం సమాజ లక్షణం కాదని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అని పేర్కొన్నారు.
అందుకే టీఆర్ఎస్ తరఫున గతంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అన్ని మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవాలని పరమత సహనం ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు ఎస్కే.జహీర్, ఎలిమినేటి అభినయ్, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవనాయక్, ఉప్పల ఆనంద్, కొండపల్లి దిలీప్‌రెడ్డి, రియాజ్, కరాటే సయ్యద్, మారిపెద్ది శ్రీనివాస్, మహ్మద్ గౌస్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, షాహిద్ మౌలానా, సయ్యద్ సలీమ్, యూసుఫ్, గౌస్ పాల్గొన్నారు.