కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా వార్షిక పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన సర్కారు ఆ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈ సారి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఎండలకు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తాగునీటి వసతితోపాటు వైద్యసేవల కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచనుంది. కొవిడ్ కారణంగా సిలబస్ తగ్గించగా 11 పేపర్లకుగాను ఆరు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42,003 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా 240 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రామగిరి, ఏప్రిల్ 22 :
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా పరీక్షల నిర్వహణ లేకుండానే విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేయడం విదితమే. ఈ సారి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళికను విద్యాశాఖ అమలు చేస్తున్నది. ఉపాధ్యాయులు, విద్యార్థులను సన్నద్ధం చేస్తూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. మే 6నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగనున్నాయి.
కరోనా మహమ్మారి సాధారణ జన జీవనంతోపాటు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేండ్లుగా ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు దూరమయ్యారు. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్చేశారు. దాంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సన్నగిల్లినట్లు పలు సర్వేలు తేల్చాయి. ఈ విద్యా సంవత్సరం జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 11 పేపర్లకు బదులు ఆరు మాత్రమే రాయాల్సి ఉంటుంది.
వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 240 కేంద్రాలకు ఏర్పాటు చేయనుండగా చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షల నిర్వహణ తీరుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
కరోనా వ్యాప్తి పెద్దగా లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి రాగానే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. ప్యూరిఫైడ్ వాటర్‌ను విద్యార్థి వద్దకే వెళ్లి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైన వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రణాళిలకను అమలు చేస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రెగ్యులర్ తరగతులతోపాటు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ బి.భిక్షపతి సూచించారు. జిల్లాలోని 107 పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓలతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలరే 19, 915 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాలకు పాత పద్ధతిలోనే బార్ కోడింగ్ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ యూసుఫ్, జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, ఎంఈఓలు, సీఎస్, డీఓలు పాల్గొన్నారు.