కట్టంగూర్, ఏప్రిల్ 22 : భువనగిరి నుంచి సూర్యాపేటకు డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కట్టంగూర్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్‌లోని కల్మెర క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అందులో 100 క్వింటాళ్ల బియ్యం ఉండడంతో వాటిని సీజ్ చేసి సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. డీసీఎంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా సూరెపల్లి గ్రామానికి చెందిన బానోత్ వెంకటేశ్, బానోత్ ప్రవీణ్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తుర్కపల్లి: అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న 17 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు ప్రాంతానికి చెందిన నరేశ్‌నాయక్ డీసీఎంలో 17 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆలేరు నుంచి గజ్వేల్‌కు తరలిస్తుండగా వీరారెడ్డిపల్లి సమీపంలో పట్టుకుని డీసీఎం, బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. నరేశ్‌నాయక్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.