దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఆకలి చావులను ఆధిగమించి పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకుని ఆపదలో ఉన్న వారిని అండగా నిలిచే స్థాయికి ఎదిగామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారానికి చెందిన బీజేపీ సర్పంచ్ ధనియాకుల కోటమ్మాసత్యనారాయణ, వార్డు సభ్యులతోపాటు సుమారు 200 మందికిపైగా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేండ్ల పాలనలో రికార్డులు సృష్టిస్తూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి చిరునామాగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని యావత్ ప్రజానీకం నమ్ముతున్నదని అన్నారు. కేసీఆర్‌ను మించిన పాలకులు కనుచూపు మేరలో ఎవరూ లేరని, ప్రతిపక్షాలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే స్థితిలో లేవని, వారిదెప్పుడూ బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 22 : యావత్ దేశంలోనే మరెక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందున్నామని, ఉమ్మడి పాలనలో ఆకలి చావులను అధిగమించి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే స్థాయికి ఎదిగామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో అభివృద్ధికి చిరునామాగా టీఆర్ఎస్ రికార్డులు సృష్టిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి పేర్కొన్నారు.
శుక్రవారం పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామ సర్పంచ్ ధనియాకుల కోటమ్మా సత్యనారాయణ, వార్డు సభ్యులతో పాటు సుమారు 200 మందికి పైగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. అతి తక్కువ సమయంలో వినూత్న రీతిలో కొనసాగుతున్న అభివృద్ధితో యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉందన్నారు. రాష్ట్రంలో విపక్షాలకు భవిష్యత్ కష్టమేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు చాలామంది పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను మించిన పాలకుడు కనుచూపుమేరలో ఎవ్వరూ లేరని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడి ప్రతి పక్షాలు ప్రజలకు ప్రాతినిథ్యం వహించే స్థితిలో లేవని, వారిదెప్పుడూ బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రజలతో కలిసి రాకపోగా తెలంగాణ ఏర్పడ్డాక కూడా వారిది ఆంధ్రా పక్షమేనని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కోర్టు కేసులతో అడ్డుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే నేడు కేవలం తెలంగాణలో 3 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తూ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని తెలిపారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణపై విషం చిమ్ముతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని విమర్శించారు.
విపక్షాలు కులమత రాజకీయాలు మానుకుని అభివృద్ధిలో కలిసి రావాలని కోరారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్ చెన్ను శ్రీనివాస్‌రెడ్డి మండల నాయకులతో పాటు పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు శ్రీరాముల గురవయ్య, పర్వతం అప్పయ్య, శ్రీరాముల కోటయ్య, సిరిషాల ఏసు, సింహాచలం, రాజు, భాగ్యమ్మ, లింగయ్య, గణేశ్, అంజయ్య తదితరులున్నారు.