వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గులాబీ దళం ఢిల్లీకి చేరుకున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సాగుతున్న ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చింది. రైతుల పక్షాన వారం నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉమ్మడి జిల్లా నేతలు ఆదివారం విడుతల వారీగా ఢిల్లీకి చేరుకున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, మున్సిపల్, మార్కెట్ కమిటీల చైర్మన్లతోపాటు ముఖ్య నాయకులంతా తరలివెళ్లారు. సోమవారం తెలంగాణ భవన్ ఆవరణలో నిర్వహించే రైతు దీక్షలో పాల్గొని దేశ రాజధాని వేదికగా కేంద్రం తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దీక్ష ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. మరోవైపుఢిల్లీలో దీక్షపై రైతాంగంలోనూ చర్చ నడుస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10(నమస్తే తెలంగాణ) : పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉమ్మడి జిల్లా నేతలంతా దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఢిల్లీ తెలంగాణ భవన్ ఆవరణలో జరిగే తెలంగాణ రైతు దీక్షలో వీరంతా పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశలవారీగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి చైర్మన్లు, మున్సిపల్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా ఢిల్లీకి తరలివెళ్లారు. జిల్లాకు చెందిన వారిలో ఎక్కువ మందికి హోటల్ అశోకాలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేంధర్‌రావు, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.
శనివారమే టీఆర్ఎస్వీ నేత జిల్లా శంకర్ నేతృత్వంలో కొంతమంది ఢిల్లీకి చేరుకుని జిల్లా నుంచి వచ్చే నేతలకు సంబంధించిన స్వాగత, బస ఏర్పాట్లను చూస్తున్నారు. ఇక సాయంత్రానికి రైతుబంధు సమితి చైర్మన్లు, మున్సిపల్, మార్కెట్ కమిటీల చైర్మన్లతోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో కొందరు కేటీఆర్ ప్రయాణించే విమానంలోనే ఢిల్లీకి చేరుకున్న వారు ఉన్నారు.
సాయంత్రం 5.30 గంటల విమానంలో ఆలేరు ఎమ్మెల్యే సునీతామహేందర్రెడ్డితోపాటు మరికొంత మంది కూడా నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ నుంచి ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బయల్దేరారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఈ రైతు దీక్ష కీలకమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ దీక్ష ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.