
గురువారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు ముజావర్ల ఇంటి నుంచి తెచ్చిన గంథాన్ని, దట్టీలను సమాధులపై అలంకరించారు. ఉర్సులో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు శుక్రవారం జరుగనున్నది. తెలంగాణతోపాటు ఆంధ్రా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడం ఆనవాయితీ కావడంతో ఆయా శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
పాలకవీడు, జనవరి 27 : మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా సైదులు బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు వేకువజామునే దర్గా పూజారి సయ్యద్ జానీ గృహం నుంచి గంధం, కలశం, దట్టీలను ఎత్తుకొని ఊరేగింపుగా దర్గాకు వెళ్లారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా జాన్‌పాక్ షహీద్ రహమతుల్లా అలై సమాధులతో పాటు వెలుపల ఉన్న సైనిక బృందాల సమాధులపై (సిపాయిలు) గంధం చల్లి, పూలమాలలు, దట్టీలతో అలంకరించారు. సమాధుల చుట్టూ మహిళలు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ముజావర్లు మగ్రీబ్, ఈషాద్ నమాజ్‌లు చేయించారు. దర్గాకు వచ్చిన భక్తులు సమీపంలో గల నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉర్సు ఉత్సవాల్లో ప్రత్యేకమైన రెండోరోజు శుక్రవారం గంధం ఊరేగింపునకు రాష్ట్రం నలుమూలల నుంచి గురువారం రాత్రే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా వక్ఫ్బోరు,్డ స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్గా దగ్గర ఫకీరులు నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం అలరించింది.
నిరంతర పర్యవేక్షణ
దర్గా ఆవరణలో అన్ని శాఖలకు సంబంధించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. దర్గా వర్క్ ఇన్స్పెక్టర్ మహుమూద్, డెక్కన్, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీల యజమానులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. దర్గా పరిసరాల్లో దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీరు చల్లారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రత చేపట్టారు. దర్గా పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి వయా దామరచర్ల, నేరేడుచర్ల మీదుగా 30కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
గంధం ఊరేగింపునకు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ గురువారం దర్గాలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేరేడుచర్ల నుంచి వచ్చే వాహనాలను జాన్‌పహాడ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, దామరచర్ల నుంచి వచ్చే వాహనాలను శూన్యపహాడ్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద, డెక్కన్ సిమెంట్ కర్మాగారం నుంచి వచ్చే వాహనాలను రావిపహాడ్ గ్రామానికి వెళ్లే దారిలో నిలిపేందుకు పోలీసు శాఖ చేసిన పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం జేపీఎస్ ఫంక్షన్ హాల్లో పోలీసు సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. దర్గా పరిసర ప్రాంతంలో తాత్కాలిక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని , సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. 300మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 22మంది ఎస్ఐలు, 250కి పైగా పోలీసులు, హోంగార్డులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.